ధరణి సమస్యలను పరిష్కరించండి

Published: Friday December 02, 2022
* ఈనెల 5న కలెక్టరేట్ లో ధర్నా

* సోమన్గుర్తి గ్రామంలో దళిత బంధువేలం

* కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 01 డిసెంబర్ ప్రజా పాలన : రైతులను ఇబ్బందులకు గురి చేసే ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ అర్థ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 5వ తేదీ సోమవారం కలెక్టరేట్ కార్యాలయాల ముందు రైతుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు. ధరణి పోర్టల్, రైతుబంధు, రైతు బీమా, ధరణికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెందిన రైతులు ధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమన్గుర్తి గ్రామంలో దళిత బంధును పార్టీలకతీతంగా బహిరంగంగా వేలం వేయడం విడ్డూరమనారు. దళిత బంధు బూచీని చూపి దళితులను నిండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకం అందరికీ ఉపయోగపడే విధంగా లేనందున హైకోర్టు నిలుపుదల చేసిందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భూస్వాముల భూములను తీసుకొని నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ లకు పంపిణీ చేశామని అన్నారు. గిరి పుత్రులకు అటవీ శాఖకు సంబంధించిన భూములలో భూ యాజమాన్య హక్కులను కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అటవీ శాఖ భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే సీతక్క ద్వారా అసెంబ్లీలో ప్రశ్నించేలా చేశామని స్పష్టం చేశారు. ప్రజలకు తోడునీడగా ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. స్వల్ప దీర్ఘకాలిక రుణాలను మాఫీ చేయడానికి 70 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ నిధులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇందిరా జలప్రభ తో రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి, కల్ఖోడ నర్సిములు, వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ జైదుపల్లి మురళి, కాంగ్రెస్ నాయకులు జగ్గరి వెంకట్ రెడ్డి, రెడ్యానాయక్, పరశురాం నాయక్, చాపల శ్రీనివాస్ ముదిరాజ్, నవీన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.