బెల్లంపల్లిలో రాజీవ్ కాంప్లెక్స్ బాధితుల నిరసన దీక్ష

Published: Tuesday November 15, 2022
బెల్లంపల్లి నవంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి:  బెల్లంపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఉన్న, రాజీవ్ కాంప్లెక్స్ దుకాణాల యజమానులు సోమవారం  స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల చర్యలకు నిరసనగా నిరసన దీక్షకు పూనుకున్నారు.
వివరాల్లోకి వెళితే రాజీవ్  కాంప్లెక్స్ లో 9 మంది వ్యాపారస్తులు గత 30 సంవత్సరాలుగా తమ సొంత ఖర్చులతో రూములు నిర్మించుకొని, కరెంటు బిల్లులు చెల్లిస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ నివసిస్తున్నామని తెలిపారు. సోమవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, ముచ్చర్ల మల్లయ్య, బండి ప్రభాకర్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రూములు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవని, సోమవారం నుండి అట్టి రూములకు  అద్దెలు పెంచుతామని, లేకుంటే ఖాళీ చేయాలంటూ బలవంతంగా సెటర్లు లాగి తాళాలు వేసి, షాపుల్లో నుండి మమ్మల్ని దొబ్బేశారని దుకాణ యాజమానులు వాపోయారు.
ఈ సందర్భంగా వారు "ప్రజా పాలన"  ప్రతినిధితో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పూ కార్యక్రమంలో రేకుల షెడ్లు తొలగించగా, మిగిలిన స్థలంలో ఎవరి స్థలంలో వాల్లము సొంత డబ్బులతో రూములు నిర్మించుకొని, ఆ చిన్న రూముల్లోనే వ్యాపారాలు కొనసాగిస్తూ జీవిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వాటి నిర్మాణానికి మునిసిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వటంతో, రాజీవ్ కాంప్లెక్స్ గా నామకరణం చేసుకున్నామే  తప్ప కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించినది ఏమీ లేదని, అట్టి రూములకు సంబంధించి మున్సిపల్ అధికారులకు ఇంటి పన్నులు, విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఆ రూములకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే తమకు చూపించాలని వారు ప్రశ్నించారు.
 కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన తాళాల విషయమై స్థానిక మున్సిపల్ అధికారులకు, పోలీస్ అధికారులకు వినతి పత్రాలు, సమర్పించామని ఫిర్యాదులు చేశామని, స్వచ్ఛందంగా వారికి వారే వచ్చి తాళాలు తీసి ఇచ్చే వరకు నిరసన దీక్ష కొనసాగిస్తూనే ఉంటామని వారు హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంప్లెక్స్ రూముల యజమానులు. ఏనుగు పెంటయ్య, విష్ణుభక్తుల రాజయ్య, శ్రీనివాసరెడ్డి,వి బి, కిషన్, ఎం, విద్యాసాగర్, సిహెచ్ రాజయ్య, రాజేష్, పాష, వారి కుటుంబ సభ్యులతో నిరసన దీక్షలో పాల్గొన్నారు.
 
 ఈ విషయమై పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంకటి శ్రీనివాసును వివరణ అడుగగా
రాజీవ్  కాంప్లెక్స్ లో నిర్మించిన తొమ్మిది దుకాణ సముదాయాలు కాంగ్రెస్ పార్టీ స్థలంలోనే  నిర్మించి అద్దెకు ఇస్తూ వస్తున్నామని, ప్రతి నెల అద్దె కూడా చెల్లిస్తున్నారని, అద్దె కోసం రాయించుకున్న పత్రాలు కూడా ఉన్నాయని, దురుద్దేశపూర్వకంగా ఆ రూములను కాజేయటానికి  అందులో అద్దెకు ఉంటున్న బాధితులు, ఎవరో చెప్పుడు మాటలు నమ్మి రూములు తమ వేనంటూ బజారుకెక్కడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు, మా వద్ద ఉన్న ఆధారాలతో స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. రాజీవ్ కాంప్లెక్స్ పేరున స్థానిక మున్సిపల్ ఆఫీసులో పన్నులు చెల్లించిన రిసిప్ట్ లు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు.