రాయితీలు నిలిపివేసి రైతుబందు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Saturday June 26, 2021

జన్నారం, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి :  ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు పనిముట్ల పై రాయితీలు దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలకు రాయితీలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రంలో రాయితీలను నిలిపివేసి టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు  ఇస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐబి గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి తీర సమయానికి రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయలేక పోయిందని అన్నారు. రైతులు బ్యాంకు రుణాలను చెల్లించక పోవడంతో రైతుబంధు రూపాయలను బ్యాంక్ అధికారులు అప్పు కింద జమ చేసుకుంటున్నారని అన్నారు. బ్యాంక్ అధికారుల చర్యలవల్ల మనస్థాపంతో ఇద్దరు గిరిజన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య లేనని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై ఎస్టి కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామన్నారు.  అలాగే రైతులు పండించిన వరి ధాన్యాన్ని తాలు పేరుతో కోతలు విధిస్తూ మిల్లర్ల తో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారన్నారని, కంప్యూటర్ కాంట ద్వారా తూకం వేయాల్సి ఉండగా మిల్లర్లు వేసిన కాంతుల తోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాలకు రూపాయలు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వరి ధాన్యాన్ని తూకం వేయడంలో కింటాల్ కు రూపాయలు 40 రైతుల వద్దనే వసూలు చేస్తున్నారని, లారీ కిరాయి లు కూడా రైతుల వద్ద నుండే వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఉట్నూర్ జెడ్ పి టి సి చారులత రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ భరత్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభుదాస్ పసి పుల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి మండల నాయకులు ఇమ్రాన్ ఖాన్ ఇంద్రయ్య తదితరులు పాల్గొన్నారు