త్రాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

Published: Wednesday April 07, 2021
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 (ప్రజాపాలన) : గ్రామాలలో తాగునీరు విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సూచించారు. మంగళవారం కోటపల్లి మండలానికి చెందిన నాగసాన్ పల్లి అనుబంధ గ్రామం నాగసాన్ పల్లి తాండలలో గ్రామ సర్పంచ్ పద్మనాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటించి వీధి వీధి తిరుగుతూ గ్రామ ప్రజల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఉదయం 06.30 గంటలకు పర్యటించారు. మీతో నేను పర్యటనలో భాగంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను నివేదించారు. నాగసాన్ పల్లి  గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు విద్యుత్ సమస్యల గురించి వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే కొత్త పోల్స్ వేయటం, నూతనంగా ట్రాన్స్ఫార్మర్ బిగించటం ద్వారా విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. గ్రామంలోని పలు ఇండ్లకు నల్లా కనెక్షన్ లేకపోవడంతో తాగునీరు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నల్లాలు బిగించి ట్యాంకు సామర్ధ్యం పెంచేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. బయటి ఫిల్టర్ వాటర్ కంటే మిషన్ భగీరథ నీరే శ్రేష్ఠమని హితవుపలికారు. గ్రామంలో ప్రతి కుటుంబం మిషన్ భగీరథ నీరే తాగాలని సూచించారు. నాగసాన్ పల్లి గ్రామ చెరువు నుండి కాలువలను ఏర్పాాటు చేస్తే 200 కుటుంబాల వారు హాయిగా బ్రతకగలుగుతారని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. చెరువు కింద కాలువలను మరమ్మతు చేసి రైతులకు సాగునీటిని అందించాలని సూచించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరి పంట పాడు కాకుండా ఉండటానికి కాలువల ద్వారా నీరు మళ్లించే ఏర్పాటు చేయాలని అధికారులను ఫోన్ లో ఆదేశించారు. నాగసాన్ పల్లి తాండలో రోడ్డుపై మేకలను పశువులను  కట్టేయరాదని సూచించారు. ఎప్పటికప్పుడు గ్రామంలోని రోడ్ లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో పాఠశాల దగ్గర పశువులను నివాసం ఉంచారదని, పశువుల కోసం షెడ్ నిర్మాణం చేయాలని గ్రామ సర్పంచ్ ను ఆదేశించారు. పశువులకు ఇంజెక్షన్ వేయటానికి అవసరమైన స్టాండ్ ను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలని అధికారులను కోరారు.  గ్రామంలో పలు చోట్ల ఇండ్లు శిథిలావస్థ స్థితిలో ఉండి పక్క ఇంటి వాళ్ళకు ఇబ్బంది కలుగుతుందని తెలుసుకుని వెంటనే నోటీసు ఇచ్చి శిథిలావస్థకు చేరుకున్న ఇంటిని కూల్చివేయాలని గ్రామ సెక్రెటరీని ఆదేశించారు. నేరుగా లబ్ధిదారులకు చెక్కులు జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ "మా ఇంటికి రండి"  కార్యక్రమంలో భాగంగా కోటపల్లి మండలం లోని బీరోల్, నాగసాన్ పల్లి, జిన్నారం, కంకణాలపల్లి, ఎన్కేపల్లి గ్రామాల్లో పర్యటించి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి *కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్* చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్, సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, వైస్ ఎంపీపీ ఉమాదేవి. ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.