వనమా రాఘవని తక్షణమే అరెస్టు చేయాలి

Published: Friday January 07, 2022
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల
మధిర జనవరి 6 ప్రజా పాలన ప్రతినిధి కొత్తగూడెంలో రామకృష్ణ కుటుంబం ఆత్మ హత్యకు కారకులైన అధికార పార్టీ నేత వనమా రాఘవని తక్షణమే అరెస్టు చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రిటైర్డ్ సీఐ మద్దెల ప్రసాద రావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మధిరలో విలేకరులతో మాట్లాడుతూ కొత్తగూడెంలో వనమా రాఘవ కీచక పర్వాలు వేధింపులు తారా స్థాయికి చేరుకున్నాయన్నారు. వనమా రాఘవ వేధింపుల వల్ల ఇప్పటికే అనేక కుటుంబాలు బలి కాగా, మరికొన్ని కుటుంబాలు ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియో మానవతావాదుల ను ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. సెల్ఫీ వీడియోను ఆధారం చేసుకుని వనమా రాఘవపై హత్య కేసు, ఫోక్సో కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వనమా రాఘవపై గతంలోనే అనేక కీచక ఆరోపణలు ఉన్నాయని, దీనికితోడు మాఫియా చరిత్ర కూడా ఉన్నదని, అధికారులు అప్పుడే చర్యలు తీసుకునిఉంటే ఇప్పుడు మరో కుటుంబం బలికాకుండా ఉండేదన్నారు. కొత్తగూడెంలో  వనమా రాఘవ కీచక పర్వాలపై సీనియర్ ఐపీఎస్ అధికారి చేత విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనమా రాఘవ  కొత్తగూడెంలో మాఫియాగా తయారయ్యారనిఆయన ఆరోపించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ వనమా వెంకటేశ్వరరావు తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి వనమా రాఘవ అరెస్టు చేయకపోతే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైయస్ షర్మిల ఆధ్వర్యంలో  వనమా రాఘవ అకృత్యాలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.