అలుపెరగని పోరాటయోధుడు బోడేపూడి సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు

Published: Saturday August 06, 2022
బోనకల్,ఆగస్టు 5 ప్రజా పాలన ప్రతినిధి: మధిర మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరావు అలుపెరగని పోరాటయోధుడని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ముందుగా బోడేపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం స్ధానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో 25వ వర్ధంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా తన జీవితంలో అలుపెరగని రాజకీయ పాత్రపోషించారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో బోడేపూడి ప్రముఖ పాత్ర పోషించారని, కమ్యూనిస్టు ఉద్యమమంటేనే బోడేపూడి గుర్తుకువస్తారన్నారు. అననుకూల పరిస్థితుల్లోను నిస్వార్ధంగా, ఆదర్శవంతమైన ఉద్యమాలు నిర్మించి పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాచేసినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన ఘన నివాళి అన్నారు. నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర ప్రజల సమస్యలపై కూడా అసెంబ్లీలో తనదైన శైలిలో ప్రస్తావించేవారని ఆయన కొనియాడారు. ఆయన పేరుతో బోడెపూడి విజ్ఞానకేంద్రం ఏర్పాటుచేసి అనేక మంది విద్యార్ధులకు హాస్టల్, లైబ్రరీ సదుపాయాన్ని కల్పించి ఎంతో మందిని అభ్యుదయ భావజాలం వైపు తీసుకెళ్ళినట్లు ఆయన తెలిపారు. అమరుల వర్ధంతి అంటే వారి ఆశయాలను, సిద్ధాంత భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడమేనన్నారు. అమరవీరుల ఆశయసాధనకై ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బోనకల్ గ్రామ శాఖ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు, గిరిజన సంఘం జిల్లాఉపాధ్యక్షులు గుగులోత్ పంతు, సిపిఎం నాయకులు చెన్నా లక్ష్యాద్రి, వార్డు మెంబర్ ఉప్పర శ్రీను, ఏసుపోగు బాబు, మచ్చ గురవయ్య, గుగులోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.