ప్రజావాణి దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Tuesday February 08, 2022
ఆసిఫాబాద్ జిల్లా, ఫిబ్రవరి 07, ప్రజాపాలన, ప్రతినిధి : ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని తాండూరు మండల కేంద్రానికి చెందిన రమేష్ గౌడ్ తన దరఖాస్తులో తండ్రి నుండి తనకు రావాల్సిన భూమిని అక్రమంగా వేరొకరి పేరు పై పట్టా చేయడం జరిగిందని, ఈ విషయంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాలోని జంగావ్ గ్రామానికి చెందిన నౌనద్ బేగం తన భర్త మరణించడం వల్ల ఇలాంటి జీవనాధారం లేదని వితంతు పెన్షన్ ఇప్పించాలని, కాగజ్ నగర్ మండలం గువ్వల గూడెం గ్రామానికి చెందిన నామిని బాపు తన గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, సిర్పూర్ మండలం లోనే వెళ్లి గ్రామానికి చెందిన ధర్మపురి అనురాధ తనకు శివారులో భూమి ఉందని, కానీ ధరణిలో కనిపించడం లేదని, ఆన్లైన్లో నమోదు చేయాలని, చిర్రకుంట గ్రామ వట్టి వాగు కాలనీకి చెందిన కొట్నాక సోనేరావు తన భూమిని వట్టి వాగు ప్రాజెక్టులో ప్రభుత్వం వారు తీసుకొని వేరే ప్రాంతంలో భూమిని ఇచ్చారని, ఇట్టి భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం రైతుబంధు కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు అందించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.