గ్రామాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి ** జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహ

Published: Tuesday March 14, 2023
ఆసిఫాబాద్ జిల్లా మార్చి 13 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
గ్రామాలలో అభివృద్ధిపై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ప్రభుత్వ పనుల నిర్వహణ పక్కాగా ఉండాలని, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. సోమవారం మండలాల్లో ఉన్న క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్ ల నిర్వహణపై అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయి తో కలిసి అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిస్థితి పంచాయతీ కార్యదర్శులతో పాటు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రకృతి వనాల్లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న పిచ్చి మొక్కలు తొలగించాలని, ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో పని దినాలు కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధార్ నమోదు ప్రక్రియ 100% పూర్తి కావాలన్నారు. కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనీ,.త్వరలో అన్ని గ్రామ పంచాయతీలు పర్యటిస్తానని ఎక్కడైనా పారిశుద్ధ్య నిర్వహణ లోపం కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్, డిపిఓ రమేష్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.