బహుజన రాజ్యాధికార వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్* -ప్రొఫెసర్ కె రామకృష్ణ, బి.వి.వి రాష్ట్ర

Published: Saturday August 20, 2022
సర్దార్  సర్వాయి పాపన్న గౌడ్ గురించి ప్రొఫెసర్ కె రామకృష్ణ గారి సందేశం ద్వారా కొన్ని మాటలు భారత  దేశాన్ని ఎందరో విదేశీయులు దండయాత్రలు చేసి పరిపాలించారు. ఈ క్రమంలో ధనాన్ని, సంపదని, శ్రమని, దోచుకోవడమే కాకుండా ఇక్కడి మూలవాసుల సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేశారు. 3 నుంచి 19వ శతాబ్దం వరకు చోళులు, మొఘలులు, రాజ్ పుత్ లు, పాలలు, చలుక్యలు, పల్లవలు, సుల్తాన్లు , మరియు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఈ నాటికీ ఆ పాలకుల పాలనా అవశేషాలు వివిధ రూపాల్లో మనకు కనబడుతూనే ఉన్నాయి. 
ముఖ్యంగా ఆర్యులు భారత దేశ మూలవాసుల సంస్కృతి సంప్రదాయాలను ధ్వంసం చేసి మనువాద పాలనను ఈ దేశంలో స్థిరపరిచారు. ఎవరు పరిపాలించిన ఈ మనవాత భావజాలం ఏదో ఒక రూపంలో రాజ్యాన్ని శాసిస్తూనే వచ్చింది. అందుకే ఈ సామాజిక వివక్ష ప్రతి రాజవంశంలోనూ కనబడుతుంది. ముఖ్యంగా 15 నుంచి 17వ శతాబ్దంలో భారతదేశాన్ని పాలించిన మొఘలులను కూడా తమ పరిపాలనను బాద్షా కేంద్రంగానే పరిపాలించినప్పటికీ, కొన్ని గ్రామాలను కలిపి పర్గాణాలుగా ఏర్పాటుచేసి పాలనా వికేంద్రీకరణ చేసారు. కానీ చివరకు గ్రామస్థాయిలో మాత్రం చౌకీదారు, పటేల్, పట్వారి జమీందార్, కొత్వాల్ ల ద్వారా సుబేదార్,  దివాన్ లో కేంద్రంగా పాలించారు.  ఈ క్రింది స్థాయి గ్రామ పాలనలో మళ్లీ అధిపతి వర్గాలే, ఈ బహుజన ప్రజల్ని పరోక్షంగా పారిపాలించే వారు. మనువాద నిచ్చెనమెట్ల వ్యవస్థ మళ్లీ ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా పీడించేది.  ఈ విధంగా చోళుల నుంచి బ్రిటిష్ పాలకుల దాకా ఏదో ఒక రూపంలో ఈ చాతుర్వర్ణ మనువాద వ్యవస్థ ప్రజల్ని ఎన్నో హింసలకు గురిచేసింది.  ఒక విధంగా ఈ చాతుర్వర్ణ మనువాదమే ప్రజల్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అణచివేసింది. రక్తాన్ని చెమటగా మార్చి తమ కులవృత్తుల ద్వారా మరియు వ్యవసాయం ద్వారా సంపాదించినదంతా పన్నుల రూపంలో దోచుకునే వాళ్ళు. మొఘలులు కూడా అదే పద్ధతిలో గ్రామస్థాయి అధికారులను ఆధిపత్య మనువాద వర్గాల నుండే నియమించుకొని పాలన సాగించారు. అందుకే ఈ హింస, వివక్ష ప్రతి రాజవంశ పాలనలోనూ కనబడుతుంది.
  
 ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, జనగాం ప్రాంతంలోని  కిలా షాపురంలో పుట్టిన పాపన్న గౌడ్, తన తల్లి కోరిక మేరకు కులవృత్తి అయిన కల్లు గీత నేర్చుకుని, కల్లు గీసేవాడు.  ఈ జమీందారులు, పటేల్ పట్వారిలు, దొరల అరాచకాలు చూస్తూ పెరిగిన పాపన గౌడ్,  ఈ రాచరిక, మనువాద దోపిడీ వ్యవస్థకు ఎప్పుడు ఎదురు తిరిగేవాడు. మొగల్ సామ్రాజ్య సైనికుల చేతుల్లో స్వతహాగా అవమానాలు పడ్డ సర్దార్ పాపన్న,  రాజ్యాధికారమే దీనికి పరిష్కారంగా భావించి, సబ్బండ బహుజన వర్గాలను ఐక్యం చేసే పని ప్రారంభించాడు.
 
 ఈ క్రమంలో ప్రజల్ని పీడించి శిస్తు వసూలు చేసుకున్న సైన్యం దివాన్ లకు వెళ్తూ, దారి మధ్యలో పాపన గౌడ్ మరియు ఇతర గౌడన్నలు తీసిన కల్లును దౌర్జన్యంగా తాగి,  పాపన్న మిత్రులను కొట్టారు.  దీన్ని సహించలేని పాపన్న ఎదురు తిరిగాడు. సైనికుల్లో ఒకడి చెయ్యి, మరోకడి తల నరికాడు.  అంతటితో ఆగకుండా అడ్డు వచ్చిన సైనికులను అందర్నీ అంతమొందించాడు. అంతే కాకుండా సైనికులు దోచుకున్న శిస్తు సొమ్మును, ధాన్యాన్ని ప్రజలకు తిరిగి పంచడం లో  మొగల్ రాజ్యంపై తిరుగుబావుట ఎగరవేశాడు పాపన్న. ఈ క్రమంలో వివిధ కులాల్లోని యువకులను చైతన్య పరుస్తూ, ఒక బహుజన గిరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
 
 స్వతహాగా గ్రామ దేవత ఎల్లమ్మ భక్తుడైన పాపన్న శివుని భక్తుడు కూడా,  బుద్ధుడి బహుజన తత్వం అనుచరించే పాపన్న "బహుజన హితాయా! బహుజన సుఖాయ!" అనే సిద్ధాంతానికి ప్రేరేపితుడై జీవితాంతం తన పాలనలో బహుజనులకు పెద్దపీట వేశాడు.
 
దక్కన్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న పాపన్న, ఔరంగజేబుకు కొరకరాని కొయ్యగా మారి ఆశ్చర్యాన్ని కలిగించాడు.  ఈ ప్రాంతాల నుండి ఒక పైసా కూడా శిస్తూ రావట్లేదని  కోపోద్రిక్తుడైన ఔరంగజేబు, దీన్ని తీవ్రంగా పరిగణించి పాపన్నను బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. కానీ శత్రు దుర్బేజ్యమైన సైన్యం గల సర్దార్ పాపన్న,  మొఘలుల సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు.
 
 అనతి కాలంలోనే బహుజన రాజ్యాన్ని విస్తరింప చేసిన పాపన్న గౌడ్, తన పాలనలో ఎన్నో అభివృద్ధి పనులకు చేపట్టాడు. తాటికొండలో ప్రస్తుతం ఉన్న చెక్ డాం దానికి ఒక తార్కాణం. భువనగిరి, తాటికొండ, కొలనుపాక, చేర్యాల, కరీంనగర్ , హుజూరాబాద్,  హుస్నాబాద్ తదితర ప్రాంతాలలో గొప్ప పాలన సాగించస్తూ, గొప్ప కోటలను కట్టించాడు. బలమైన పాలన సాగిస్తున్న పాపన్న,  ఔరంగజేబు మరణానంతరం డెక్కన్ ప్రాంతం పై మరింత పట్టు సాధించాడు. 
 
గోల్కొండ ను జయించాలని యుద్ధం ప్రకటించిన పాపన్నను సంధికి ఆహ్వానించాడు ఆనాటి రాజు బహుదూర్ ‌షా! సంధికి వచ్చిన పాపన్నకు ఎర్ర తివాచీ పరచి గౌరవించాడు. సంధిలో భాగంగా కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా ఉండాల్సిందిగా కోరాడు బహుదూర్ ‌షా.  ప్రజల శ్రేయస్సు కోసం యుద్ధం బదులు సంధికి ఒప్పుకుని తన రాజనీతిని ప్రదర్శించాడు పాపన్న గౌడ్. బహుజన రాజ్యం జెండాను గోల్కొండపై ఎగురవేసి ఆత్మగౌరవాన్ని చాటాడు సర్దార్ పాపన్న గౌడ్. 
 
ఈ చారిత్రక సంధితో మనువాదులకు జమీందారులు పట్టేళ్లు పట్వారిలు దేశ్ముకులకు పని లేకుండా పోయింది. ఇది సహించలేని ఆదిపత్య మనువాద వర్గాలు రాజు బహుదూర్ షాకు, పాపన్న పై వ్యతిరేకంగా చాడీలు చెప్పటం సాగించి, విషం నూరిపోశారు. చెప్పుడు మాటలు విన్న బహుదూర్ష పాపన్నను అంతమొందించాల్సిందిగా తన సైన్యాన్ని ఆదేశించాడు.
 
   చరిత్రకారులు కథనం ప్రకారం, కుట్ర తెలుసుకున్న పాపన్న, మారువేషంలో తన కులవృత్తి చేస్తూ హుస్నాబాద్ ఎల్లమ్మ గుడి ప్రాంతంలో అజ్నాత జీవితం సాగించాడని చెబుతారు.  ఈ క్రమంలో సైనికులకు పట్టుబడి ఆత్మ ప్రాణత్యాగం చేసుకొని మరణించాడంట.  పాపన్న తలను బహుదూర్ షాకి ఇస్తే, రాజు, పాపన్న తలని గోల్కొండకు వేలాడదీశాడని కథనాలు వాడుకులో ఉన్నాయి. 
   
 బహుజనులకు రాజ్యాధికారం ఎంత అవసరం 16వ శతాబ్దంలోనే గుర్తించి పోరాటం సాగించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో నేడు తెలంగాణలో దొరల చేతుల్లో నుంచి బహుజనుల్ని విముక్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కిలా షాపురం నుంచే మన బహుజన రాజ్యాధికార ఉద్యమం ఆరంభమైంది. మహనీయుల త్యాగాల సాక్షిగా మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వైపు అడుగులు వేసే దిశగా బహుజనలందరూ ఐఖ్యమై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో బహుజన రాజ్యాన్ని తెలంగాణలో,  ఈ దేశంలో ఏర్పాటు చేసే దిశగా పయనిద్దాం.  అదే సర్దార్ పాపన్న గౌడ్ కి మనందరం ఇచ్చే ఘన నివాళి.
 
సాధిద్దాం బహుజన రాజ్యాన్ని!
చేధిద్దాం మనువాదుల కుట్రలను!
 
ఇట్లు మీ
*ప్రొఫెసర్ కె రామకృష్ణ*
9912807907 (WhatsApp)