మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆర్ ఓ బి బ్రిడ్జి కింద పనులను వేగవంతంగా పూర్త

Published: Saturday June 18, 2022

 

 బోనకల్, జూన్ 17 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ వి పీ గౌతమ్ పర్యటించారు. 
ముందుగా ముష్టి కుంట గ్రామంలో పోలంపల్లి మైనర్ కాలువను పరిశీలించారు. కాలువ పైన చెట్లు పెరిగి చెత్తాచెదారం ఉండటాన్ని చూసి నీటిపారుదల శాఖ డి ఈ శ్రీనివాస్ రావు ప్రశ్నించారు. కాలువ పైన చెట్లను ఈజీఎస్ ద్వారా ఎందుకు తొలగించడం లేదని డి ఈ ని అడిగారు. ముళ్లకంచెలు తొలగించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కాలు పై ముళ్ళకంప ఉంటే రైతులకు, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, శుభ్రం చేయటం వలన అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. అదే సమయంలో కొంత మంది కూలీలు పనులకు వెళ్లి వస్తుండగా కలెక్టర్ వారిని మందలించి, ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రోజు ఎంత కూలి వస్తుంది అని అడగగా100 రూపాయలు వస్తున్నాయని కూలీలు అన్నారు. ఉపాధి హామీ పనులు ఎన్ని గంటల వరకు చేస్తున్నారని కలెక్టర్ వారిని అడగగా7 గంటలకు వెళ్లి 11 గంటలకు తిరిగి వస్తున్నామని వారు అన్నారు. అనంతరం బోనకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. క్రీడా ప్రాంగణాన్నిపరిశీలిస్తూ సర్పంచ్ కు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని ఆర్ ఓ బి  బ్రిడ్జి కింద పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సర్పంచ్ ను ఆదేశించారు. బోనకల్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణం పట్ల, ప్రభుత్వ కళాశాల ఆవరణలో గల పల్లె ప్రకృతి వనం పట్ల  బోనకల్ సర్పంచ్ భూక్యా సైదా నాయక్ ను కలెక్టర్ అభినందించారు.  పొలంపల్లి మైనర్ పై మొక్కలు నాటడం పట్ల ఆ గ్రామాల సర్పంచులను కూడ కలెక్టర్  అభినందించారు. పల్లె ప్రగతి పనులలో భాగంగా మండల పరిధిలోని బోనకల్, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాలలో పర్యటించి ఆయా గ్రామాలలో నాటిన మొక్కలను పరిశీలించి ఆయా గ్రామాల సర్పంచులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మండల కేంద్రంలో గల క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ ఆడుతుండగా వారితో పాటు వెళ్లి బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడి తన ఉత్సాహాన్ని కనపరిచారు. అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ సీనియర క్రీడాకారుడు కోచ్ అమరేసి లింగయ్య చేస్తున్న కృషిని బోనకల్ సర్పంచ్ సైదా నాయక్ ,ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి కలెక్టర్ కు వివరించారు. బోనకల్ మండలం నుంచి జాతీయస్థాయిలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాణిస్తున్నారని దీనికంతటికీ కారణం కోచ్ లింగయ్య అని, 20 ఏళ్లుగా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేస్తున్నారని వివరించారు. దీంతో కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ లింగయ్య ను అభినందించారు. కలెక్టర్ కొద్దిసేపు బాల్ బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మండల కేంద్రంలోని ఆర్ ఓ బి బ్రిడ్జి కింద బోనకల్ గ్రామపంచాయతీ చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆర్ ఓ బి  బ్రిడ్జి కింద గల అన్ని  ఖానాలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి గ్రామ పంచాయతీ సర్పంచ్ కి పలు సూచనలు చేశారు. ఒక్కొక్క ఖానాలో ఒకే రకమైనవి ఏర్పాటు చేయకుండా వివిధ రకాలను ఏర్పాటు చేయాలని సర్పంచ్ కు సూచించారు.  పనులన్నింటినీ ఎప్పటి కల్ల పూర్తి చేస్తారని సర్పంచ్ ను కలెక్టర్ ప్రశ్నించగా వారం, పది రోజులలో పూర్తి చేస్తానని తెలిపారు. ఆర్ ఓ బి బ్రిడ్జి కింద వాహనాలు వెళ్లే  ఖానాలో నారాయణపురం మైనర్ పై ఉన్న కాలవ చాంబరు వాహనాలకు ఇబ్బందికరంగా ఉందని  కలెక్టర్ కు సర్పంచ్ వివరించగా వెంటనే స్పందించి ఆర్ అండ్ బి ఈ ఈ శ్యాం ప్రసాద్, నీటి పారుదల శాఖ డి ఈ  శ్రీనివాస్ లను పిలిపించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ ఛాంబర్ రోడ్డు కు సగం స్థలాన్ని ఆక్రమించి ఉందని, దీని వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగి ప్రమాదాలు జరుగుతున్నాయని సైదా నాయక్ వివరించారు. దీంతో వెంటనే ఆర్ అండ్ బి ఈ ఈ ని భూమికి సమాంతరంగా తిరిగి పునర్నిర్మాణం చేపట్టాలని దీనికి అవసరమైన ఎస్టిమేట్ ను వెంటనే తయారుచేసి అందజేయాలని ఆదేశించారు. రావినూతల వైపు గల ఆర్ ఓ బి స్థలాన్ని , బస్టాండ్ ను కూడా కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ బస్టాండ్ లో కి బస్సులు వెళ్లడం లేదని, బస్సులు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ స్పందించి బస్సులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని అన్నారు. ఆర్ ఓ బి బ్రిడ్జిపై లైట్లు లేవని, ఆర్ ఓ బి బ్రిడ్జి ఎక్కడానికి మెట్లు కూడా లేవని బోనకల్ సర్పంచ్ సైదా నాయక్, రావినూతల మాజీ సర్పంచ్ షేక్ వజీర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఇందుకు సంబంధించి కూడా వెంటనే ఎస్టిమేట్ వేయాలని ఆర్ అండ్ బి ఈ ఈ ను ఆదేశించారు. బోనకల్ వైపు ఆర్ ఓ బి బ్రిడ్జి కింద బోనకల్ సర్పంచ్ చేయిస్తున్న విధంగానే రావినూతల వైపు కూడా బ్రిడ్జి కింద వెంటనే పనులు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని సర్పంచ్ కి చెప్పి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని మండల అధికారులను ఆదేశించారు. రావినూతల గ్రామం లోని వైరా- జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై హరిత హారంలో వేసిన మొక్కలను ఆయన పరిశీలించారు. చిరునోముల సర్పంచ్ మూలకారపు రవి దళిత కాలనీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుంటున్నారని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అదేవిధంగా మాకు నేటి వరకు గ్రామీణ క్రీడా ప్రాంగణానికి స్థలం కేటాయించలేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ సర్పంచులు ఉత్సాహంగా పని చేస్తుంటే  మీరెందుకు ఆలస్యం చేస్తున్నారని మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డి పి ఓ జూపల్లి హరిప్రసాద్, డీఎల్పీవో రావూరి పుల్లారావు ,తాసిల్దార్ రావూరి రాధిక, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఆర్ అండ్ బి డి ఈ రాజశేఖర్, ఈజీ ఎస్ ఏ పి ఓ బసవోజు కృష్ణకుమారి, ఈ సి పిల్లుట్ల కిరణ్ కుమార్, పి ఆర్ జె ఈ  మొండితోక నవీన్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు భూక్యా సైదా నాయక్, షేక్ జాన్ బి, కొమ్మినేని ఉపేందర్ ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు దామళ్ళ కిరణ్, నల్లబెల్లి రఘు, జొన్నలగడ్డ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.