గిరిజన సంస్కృతినిపై దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Published: Wednesday February 16, 2022
సేవాలాల్ జయంతి సభలో భూక్యా వీరభద్రం.
భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని, సేవలాల్ మహారాజ్ స్ఫూర్తితో ఐక్యంగా పోరాడి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందామని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం వైరా నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోతు బాలాజీ అధ్యక్షతన జరిగిన సభలో భుక్య వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తూ ఉన్న రిజర్వేషన్ ఎత్తేయాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. గిరిజన ప్రాంతాలలో భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయించే కుట్ర జరుగుతోందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా గిరిజనులకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతోందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, గిరిజన హక్కులను రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని కోరారు. వైరా నియోజకవర్గంలో గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు, పేదలందరికీ ఇండ్ల నిర్మాణం, సేవాలాల్ జయంతి రోజును శెలవు దినంగా ప్రకటించాలని సేవలాల్ స్ఫూర్తితో పోరాడుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బానోతు హరిచరణ్ బానోతు రాము, వెంకటేష్, రాములు, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.