బురద రోడ్డుగా మారిన లడక బజార్ సిమెంట్ రోడ్డు

Published: Tuesday June 28, 2022

మధిర రూరల్ జూన్ 27 ప్రజాపాలన ప్రతినిధి పట్టణంలోని లడక బజారు లోని సిమెంటు రోడ్డు బురద రోడ్డు గా మారడంతో ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేందుకు మిషన్ భగీరథ సిబ్బంది గుంటలు తీసి పైపులైన్ వేశారు. ఈ క్రమంలో మట్టి మొత్తం రోడ్డుపైనే వదిలేసి తూతూమంత్రంగా పనులు చేసి వెళ్ళిపోయారు. మట్టి మొత్తం సిమెంట్ రోడ్డు పైనే ఉండిపోవడంతో గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు మొత్తం బురదమయం కావటంతో ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది.మధిర పట్టణంలో మిషన్ భగీరథ అధికారులు ఇస్టా ను సారంగా పనులు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించి చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మిషన్ భగీరథ సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పట్టణంలో ఏ రహదారిలో కూడా మిషన్ భగీరథ అధికారులు పైపులైను నిబంధన ప్రకారం వేయటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైపులైను వేసేందుకు ద్వంసం చేసిన రహదారులను నిర్మించాల్సిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఎక్కడ కూడా వెంటనే రహదారులు పునర్నిర్మాణం చేయటం లేదు మున్సిపాలిటీ అధికారులు స్పందించి సిమెంట్ రోడ్ పైన ఉన్న మట్టిని తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.