ఘనంగా దొడ్డి కొమురయ్య 96 వ జయంతి వేడుకలు

Published: Tuesday April 04, 2023

జవహర్ నగర్ , ఎప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, విస్నూర్‌ దేశ్‌ముఖ్‌పై పోరాడిన విప్లవవీరుడు దొడ్డి కొమురయ్య గా తెలంగాణ రాష్ట్ర కురుమ యువచైతన్య సమితి కార్యదర్శి మంగ యాకయ్య పేర్కొన్నారు. వారి ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కార్మిక నగర్ లో,  దొడ్డి కొమురుయ్య 96 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కార్పోరేషన్ మేయర్ మేకల కావ్య  కురుమ  దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, ఎస్సీ పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షురాలు మెచ్చినేని శ్రీదేవి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాటంలో భాగంగా కొందరి చేతిలో కేంద్రీకృతమైన వేలాది ఎకరాల భూమిని వారి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి పేదలకు పంచిన తెలంగాణ సాయుధ పోరాట అమరుడిగా దొడ్డికొమురయ్యను పేర్కొన్నారు. దేవరుప్పుల మండలం కడవెండిలో ప్రజలను చైతన్యపరిచి వెట్టిచాకిరికి వ్యతిరేకంగా విస్నూరు రామచంద్రారెడ్డి పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ఆయన చూపిన సాహసం నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. మేయర్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం తుపాకి తూటాలకు ఎదురొడ్డి పోరాడి  వీర మరణం  పొందిన అమరుడు దొడ్డి కొమురయ్యగా పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారన్నారు. జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని, సాయుధ పోరాటం , భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వమే పునాదిగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్ధానిక  నేతలు కన్నయ్య రాజు బూడిద బాలరాజు మద్దూరు సిద్ధయ్య కురుమ మాయ కోటి శీను కురుమ మంగ భాస్కర్ కురుమ రేగు మహేందర్ కురుమ  రేణుక నగర్ అధ్యక్షులు సత్తయ్య మామిళ్ల మల్లేష్ యాదవ్ బన్నీ, కార్యకర్తలు, కురుమ సంఘం నేతలు,  ప్రజా సంఘాలు తదితరులు హాజరయ్యారు.