ఏడేండ్లలో రూ. 625 కోట్ల సబ్సిడీ

Published: Wednesday January 04, 2023
★ నిరుపేద ఎస్సీ,ఎస్టీలకు ఉచితంగా 101 యూనిట్లు
★ విద్యుత్తు చార్జీల భారాన్ని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
★ రాష్ట్ర వ్యాప్తంగా 7.76 లక్షల మందికి ప్రయోజనం
* 32వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 03 జనవరి ప్రజా పాలన : ఉమ్మడి పాలకుల హయాంలో తీవ్ర నిరాదరణకు గురైన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలను ప్రగతి పథంలో పరుగులు తీయిస్తున్నారని 32వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకించి విద్యుత్తు రంగాన్ని అత్యంత పటిష్ఠంగా తీర్చిదిద్ది ఆ ఫలాలను బడుగు వర్గాలకు పంచుతున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెలా ఉచితంగా 101 యూనిట్ల విద్యుత్తును అందిస్తున్నది. ఇందుకు అవుతున్న ఖర్చును 2015 నుంచి ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో చెల్లిస్తున్నది. ఇప్పటివరకు రూ.625 కోట్లకుపైగా చెల్లించింది. సామాజికంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీల్లో ఇప్పటికీ చాలమంది గుడిసెలు, చిన్నచిన్న ఇండ్లలో నివసిస్తూ కేవలం ఒకట్రెండు బల్బులనే ఉపయోగించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి విద్యుత్తు చార్జీలు భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 101 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించాలని నిర్ణయించి, పకడ్బందీగా అమలు చేస్తున్నది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 7.76 లక్షల (ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో 3,17,630, ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 4,59,128) మందికిపైగా ప్రయోజనం పొందుతున్నారు. వారిలో 4,98,235 మంది ఎస్సీలకు గత ఏడేండ్లలో రూ.419 కోట్లు, 2,78,523 మంది ఎస్టీలకు రూ.206 కోట్ల లబ్ధి చేకూరింది.