నారంవారిగూడెంలో యువకుల పై సర్పంచ్ దాడి మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య:

Published: Wednesday June 15, 2022
అశ్వారావుపేట (ప్రజాపాలన ప్రతి నిధి) అశ్వారావుపేట మండలంలోని నారావారిగూడెం  గ్రామం నుండి యువజంట వెళ్లిపోయిన ఘటనలో సంబంధం ఉందంటూ స్థానిక సర్పంచ్,కుల పంచాయితీ పెట్టి దుర్భాషలాడుతూ విపరీతంగా కొట్టడంతో మనస్థాపానికి గురై డిగ్రీ విద్యార్థి కలుపు మందు తాగి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నారంవారిగూడెం లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే గత మూడు రోజుల క్రితం నారంవారిగూడెం గ్రామం నుండి యువ ప్రేమ జంట ఊరు నుంచి వెళ్లిపోయిన ఘటనలో కొందరు వ్యక్తులను అనుమానించి కుల పంచాయితీ నిర్వహించారని, ఈ పంచాయతీలో సంబంధంలేని తుమ్మ దుర్గయ్య(లేటు) పోలమ్మ దంపతుల కుమారుడు తుమ్మా భవాని శంకర్, నులకాల పిచ్చయ్య రమాదేవి దంపతుల కుమారుడు నులకాల ముత్యాలరావు, లను గ్రామపంచాయతీ సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం, గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ పేరుతో దుర్భాషలాడుతూ విపరీతంగా దాడి చేశారని దీంతో మనస్తాపం చెందిన తుమ్మా భవాని శంకర్, (18 సంవత్సరాలు డిగ్రీ విద్యార్థి) పొలంలో దాచి ఉంచిన కలుపు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడని అనంతరం చికిత్స పొందుతూ మరణించాడని కుటుంబీకులు తెలిపారు. విచారణ పేరుతో కుల పంచాయితీ పెట్టించి సంబంధం లేని వారిపై దుర్భాషలాడి దాడి చేయడం వల్లనే  కలుపు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఉదయం నుండి సాయంత్రం వరకు బంధించి ఉంచడం వల్ల ఆకలితో ఉన్న భవాని శంకర్ కు మరింత ప్రమాదం ఏర్పడి మరణించాడని, దీనికి కారణమైన గ్రామపంచాయతీ సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం, ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నారంవారిగూడెం నుండి మృతుని కుటుంబ సభ్యులు బంధువులు మృతదేహాన్ని  అంబులెన్స్ లో తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంలో మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నా చేయాలని ఆలోచించగా ఎస్సై చల్లా అరుణ నేతృత్వంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అనుమానం ఉన్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి, మీకు న్యాయం చేస్తాం అంటూ ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబీకులు మాట్లాడుతూ మృతుడు తుమ్మ భవాని శంకర్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా గ్రామ సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం తన ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తూ తప్పుడు పంచాయతీలు పెట్టి దుర్భాషలాడి దాడి చేయడం వల్లనే కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇటువంటివి గ్రామంలో అనేకం జరుగుతున్నా, సర్పంచ్ పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నా ఎటువంటి చర్యలు పోవడం వల్లనే ఇటువంటివి పునరావృతం అవుతున్నాయని తుమ్మ భవాని శంకర్ మృతికి కారణమైన సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం ను కఠినంగా శిక్షించాలని మృతుని కుటుంబీకులు డిమాండ్ చేశారు.
 
 
 
Attachments area