రైతాంగ సమస్యల పరిష్కారానికై మహా పాదయాత్రను విజయవంతం చేయండి

Published: Thursday March 03, 2022

జగిత్యాల, మార్చి 2 (ప్రజాపాలన ప్రతినిధి) : రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీ నుండి ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుండి నిజామాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డిలు విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం నాడు జగిత్యాలకు చెందిన జర్నలిస్ట్ చిట్ల సుధీర్, మేడిపల్లికి చెందిన జర్నలిస్ట్ బండ్ల సురేష్ ల మృతికి రైతు ఐక్యవేదిక నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ మూసివేసిన ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పసుపు పంటకు 15 వేల రూపాయల మద్దతు ధరను ప్రకటించి కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) జాబితాలో చేర్చాలని, ఎర్ర జొన్నలకు క్వింటాలుకు 4500 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీని అమలు చేయాలని, యాసంగిలో మొక్కజొన్న, వరి ధాన్యం, పప్పు దినుసులను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 3వ తేదీ గురువారం నుండి ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుండి ప్రారంభించి నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో సిడిసి మాజీ చైర్మన్ కంది బుచ్చిరెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక  నాయకులు గురిజెల రాజారెడ్డి, శేర్ నర్సారెడ్డి, కాటిపల్లి నాగేశ్వర్ రెడ్డి, బందెల మల్లయ్య, వేముల కరుణాకర్ రెడ్డి, క్యాతం సాయి రెడ్డి, వామన్ రెడ్డి, కోల నారాయణ, విక్రమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు