నేలని సజీవంగా ఉంచండి, నేల జీవవైవిధ్యాన్ని రక్షించండి రైతు శిక్షణ కేంద్ర వ్యవసాయ అధికారి కె

Published: Tuesday December 06, 2022
బోనకల్, డిసెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని బోనకల్,రాయన్నపేట, ముష్టికుంట్ల, గోవిందాపురం(ఎల్),రావినూతల, చిన్నబీరవల్లి రైతు వేదికల నందు సోమవారం ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా రైతు సదస్సులను నిర్వహించడం జరిగింది. రైతు శిక్షణా కేంద్ర వ్యవసాయ అధికారి కె. అరుణ కుమారి మాట్లాడుతూ నేల ఆరోగ్య పరిరక్షణకు ఆహారభద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు మానవ శ్రేయస్సు కోసం నేల నాణ్యత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా నేల జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తుందనీ, నేలలో తేమను పట్టి ఉంచే గుణం పెరుగుతుందనీ, రసాయనిక ఎరువుల మోతాదును వచ్చునని, ఎరువుల వినియోగ సామర్ధ్యాన్ని పెంచవచ్చు, మేలుచేసే సూక్ష్మజీవులకు ఆహారం లభిస్తుందనీ తెలియజేశారు.పచ్చిరొట్ట ఎరువులు వాడకం ద్వారా నేల యొక్క భౌతిక,రసాయన జీవ సంబంధ లక్షణాలను మెరుగుపరుస్తుందనీ,జీవన ఎరువుల వినియోగం ద్వారా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి భూసారం పెరగడంలో తోడ్పడుతుందనీ, దీని వలన సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందనీ పేర్కొన్నారు.పప్పుదినుసు పంటలతో పంట మార్పిడి చేయడం ద్వారా నేలను సారవంతంగా మారుననీ,
మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమను పట్టి ఉంచే గుణం పెంపొందించవచ్చు, నేల కోతను అరికట్టవచ్చునని,
నేల ఆరోగ్య పరిరక్షణకు పై యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపడటమే కాకుండా, నేల సారాన్ని ఉత్పాదకతను పెంచవచ్చుననీ అన్నారు.మట్టి నమూనాల సేకరణ విధానం, భూసార పరీక్ష ఫలితాల వలన పొందే ప్రయోజనాల గురించి తగు సూచనలు తెలియజేసారు.పొలంలో నీరు నిల్వ ఉన్నచోట, ఎరువులు వేసిన చోట, చెట్ల నీడ ప్రాంతంలో, గట్ల దగ్గర,కంచెల దగ్గర నమూనాలను సేకరించరాదనీ,
సాధారణంగా మట్టి నమూనాలను ఒక పంట పండించే భూముల్లో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెలలో, రెండు పంటలు పండించే భూముల్లో అయితే మే నెలలో సేకరించడానికి నేలలు అనువుగా ఉంటాయనీ సూచనలు ఇచ్చారు. మట్టి నమూనా తీయదలచిన పొలంలో 10 నుంచి 12 చోట్ల మట్టిని సేకరించాలనీ,నేల పై భాగంలోని చెత్త,చెదారం తీసివేసి పారని ఉపయోగించి వీ ఆకారంలో 6 అంగుళాలు లోతు గుంత తీయాలనీ,గుంత పై నుండి దిగువకు ఒకే మందం లో పలుచని పొర వచ్చే విధంగా మట్టిని సేకరించాలనీ అన్నారు. పొలంలో అన్ని చోట్ల సేకరించిన మట్టిని గోనెపట్టా లేదా పాలిథీన్ షీట్ మీద వేసి మట్టిగడ్డలను చిదిమి చతురస్రాకారంగా చేసి నాలుగు బాగాలుగా విభజించాలనీ, చతుర్విభజన పద్దతి ఆధారంగా సుమారు 1/2 కేజీ మట్టిని శుభ్రమైన గుడ్డ సంచి లేదా పాలిథీన్ కవర్ లో సేకరించాలి అని రైతులకు వివరించటం జరిగింది. భూసార పరీక్షా ఫలితాల ద్వారా పంటలకు వినియోగించే ఎరువుల మోతాదు నిర్ణయించటమే కాకుండా సమ పాళ్లలో వాడుకొని మృత్తిక సంరక్షణకు తోడ్పడుతూ ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు అని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఎర్రగుంట సాధన, ధారగాని కళ్యాణి, మరీదు త్రివేణి, బండి శ్రీకాంత్,గుగులోత్ గోపి,నాగినేని నాగసాయి,మండల రైతు బంధు సమితి అధ్యక్షులు వేమూరి ప్రసాద్, గ్రామ సర్పంచులు భూక్య సైదా నాయక్, కొమ్మినేని ఉపేందర్,పేరబత్తిని శాంతయ్య,మండలంలోని గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు మోర్ల నరసింహారావు,పెద్దప్రోలు నాగేశ్వరరావు-వెనిగండ్ల మురళి,షేక్ జానిమియా,గుమ్మా నాగేశ్వరరావు,పండగ సీతారాములు, గ్రామ ఉప సర్పంచులు,ఎంపీటీసీలు,కలకోట సహకార సంఘము చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు,వైస్ ఎంపిపి గుగులోత్ రమేష్ , ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.