ఘనంగా నిర్వహించిన శ్రీ కృష్ణామి వేడుకలు

Published: Tuesday August 31, 2021
వికారాబాద్ బ్యూరో 30 ఆగస్ట్ ప్రజాపాలన : సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్ర లేచి తలస్నానము చేసి మడి బట్టలు ధరిస్తారు. మందిరమును శుభ్రం చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. ఊరు.. వాడ ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. గోకులాష్టమి రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలము అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తీ పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకు వేసుకుంటే మంచిదని చెబుతారు. వికారాబాద్ జిల్లా పరిధిలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మర్పల్లి మండలానికి చెందిన పట్లూరు గ్రామంలో చిన్నారులు రాధా కృష్ణుల వేషధారణలతో ప్రేక్షకుల్ని కంటికి రెప్ప వాల్చనీయకుండా కనువిందు చేశారు. వికారాబాద్ మండల పట్టణ కేంద్రాలలో రాధాకృష్ణులు అలరించారు.