మొబైల్ యాప్ లో సెన్సెస్ నిర్వహించాలి

Published: Tuesday February 22, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ 
వికారాబాద్ బ్యూరో 21 ఫిబ్రవరి ప్రజాపాలన : 2021 సంవత్సరంలో నిర్వహించాల్సిన జనాభా గణన (సెన్సెస్) పనులు కరోనా కారణంగా ఆలస్యం అయినందున ఇట్టి పనులను పూర్తి శ్రద్ధతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో ఏర్పాటు చేసిన జనాభా గణన ముందస్తు సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, స్టాటిస్టికల్ అధికారులతో జనాభా గణన నిర్వహణపై అయన మాట్లాడుతూ, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనాభా గణన (సెన్సెస్) కార్యక్రమం గత 2011 తరువాత ఇప్పటి వరకు నిర్వహించబడలేదని, 2021 కు సంభందించిన జనాభా గణన నిర్వహించవలసి ఉందన్నారు.  అధికారులు పాత అనుభవంతో పారదర్శకంగా ఏలాంటి తప్పులు దొర్లకుండా ఇన్యూమరేటర్ల ద్వారా పక్కడబందిగా పనులు చేపట్టాలని సూచించారు.  2014 లో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానితో పాటు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు ఏర్పడినందున వాటికి అనుగుణంగా సెన్సెస్ నిర్వహించాలని తెలిపారు.  గతంలో నిర్వహించిన అనుభవం మేరకు నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం జనాభా గణన పూర్తి బాధ్యతతో నిర్వహించాలని అన్నారు. ఈ సందర్బంగా కేంద్ర గణన శాఖ ఉప సంచాలకులు సుబ్బరాజు సెన్సెస్ నిర్వహణపై తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్ లు, స్టాటిష్టికల్ అధికారులకు జనాభా గణనపై పవర్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కల్గించారు. ఈ సమావేశంలో  సీపీవో నిరంజన్ రావు , తాండూర్ ఆర్డిఓ అశోక్ కుమార్, కేంద్ర గణాంక శాఖ జిల్లా సెన్సెస్ ఇంచార్జి అధికారి నాయుడు, అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్ లు తదితరులు పాల్గొన్నారు.