తెలంగాణ ఇంజనీర్ల "పంచాయతీ "సమావేశం

Published: Monday November 29, 2021
హైదరాబాద్ 28 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి: రసా బాసగా పంచాయతీ ఇంజనీర్ల సమావేశం. ప్రమోషన్ల విషయం లో వాడి వేడిగా  సాగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం. ఎర్రమంజిల్ కాలనీ లోని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్- ఇన్-చీఫ్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం ఉదయం జరుగింది. తెలంగాణ పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అధ్యక్షుడు దగ్గుల సూర్య ప్రకాష్ ఆద్వర్యంలో జరిగినది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. కరోనా మూలంగా సభ్యత్వ రుసుము మరియు అడ్వర్టైజ్మెంట్ రుసుము వసూలు విషయంలో జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు చొరవ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పదోన్నతుల విషయంలో సభ్యులు మూకుమ్మడిగా  అసోసియేషన్ బాడీ ని నిలదీశారు. పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల విషయంలో ప్రధాన కార్యదర్శి వివరించే ప్రయత్నం చేయగా పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. చేవెళ్ల జిల్లా అధ్యక్షుడు అడ్డు పడుతూ అందరీ ఆమోదం తో ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రమోషన్లు జరగాలని అందరికీ న్యాయం జరిగేలా అసోసియేషన్ చొరవ తీసుకోవాలని నల్లగొండ రీజియన్ సెక్రటరీ 'కొరమోని బాలచందర్' సూచించారు. దీనికి సభ్యులు అందరూ ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. 2018 సంవత్సరంలో ఎన్నికల్లో గెలుపొందిన ప్రస్తుత అసోసియేషన్ బాడీ కాల పరిమితి ఈ నెలతో తీరి పోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికలు వెంటనే జరపాలని పలువురు సభ్యులు ఏక గ్రీవంగా డిమాండ్ చేశారు. అసోసియేషన్ అనేది అందరి  ఉద్యోగుల సంక్షేమం కోసం అనే చిన్న విషయాన్ని మరిచి ఒక జోన్ వారికి వత్తాసు పలుకుతూ అసోసియేషన్ ఎన్నికైన మొదట్లోనే అసోసియేషన్ లెటర్ ప్యాడ్ పైన మంత్రులకు వినతి పత్రం సమర్పించడం సబబు కాదని పలువురి సభ్యుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. కరోనా పేరుతో రెండు సంవత్సరాల కాలపరిమితిని కాలయాపన చేశారని ఎలాంటి హామీలను నెరవేర్చలేదనే పలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు‌. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అని సభ్యులను పిలిపించి గత శాసన మండలి ఎన్నికల ప్రచార సభలో మంత్రులకు ప్రతిపాదనలు సమర్పించి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం పూర్తి అయ్యిందనిపించారనే అభియోగం... గత రెండు సంవత్సరాల కు సంబంధించిన సభ్యత్వ రుసుము డిసెంబర్ నెల 5 వ తేదీ వరకు వసూలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు తెలపడంతో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వల్లమల్ల రఘుపతి ఇంత తక్కువ సమయంలో సభ్యత్వ రుసుము వసూలు చేయడం కష్టం అని అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రమోషన్ల విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివరణను చేవెళ్ల జిల్లా అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి తప్పు పట్టారు. ప్రమోషన్ల కొరకు అసోసియేషన్ తీసుకున్న చొరవ చేసిన ప్రయత్నాలను ఒక్కొక్కటి చొప్పున అన్ని విషయాలను కూలంకషంగా సభ్యుల దృష్టికి వెంట వెంటనే తీసుకొని రావాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. తిరిగి అతి త్వరలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలనే తీర్మానంతో సమావేశం ముగిసింది.