మండుతున్న కూరగాయల ధరలు

Published: Monday November 22, 2021
హీటెక్కిన టమాటా.. ఘాటెక్కిన ఉల్లి
మధిర నవంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి : కూరగాయల ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయి. వరుసగా తుఫాన్లు రావడంతో సరైన రవాణా లేక కూరగాయల ధరలు పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు. గతంలో కేజీ 15 రూపాయల ధర పలికిన కూరగాయలు సైతం భారీగా పెరిగిపోయాయి. రైతు బజార్లో టమాటా, దోసకాయ, వంకాయ, దొండకాయ, బీరకాయ, పొట్లకాయ, బెండకాయ, తదితర కూరగాయలన్నీ కేజీ 35 నుండి 80 రూపాయల వరకు ధరలు పలుకుతోంది. బయట మార్కెట్లో మరో పది రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఉల్లిగడ్డల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రైతు బజార్లో ఉల్లిగడ్డ ధర కేజీ 45 రూపాయలు ఉండగా, సాధారణ మార్కెట్లో కేజీ 70 రూపాయల వరకు ధర పలుకుతుంది. దీంతో సామాన్యులు ఉల్లిగడ్డలు కొనాలంటేనే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి. సహజంగా ఉల్లిగడ్డలు కోస్తే ప్రజలకు కళ్ల నుండి నీళ్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఉల్లిపాయలు ధర వింటేనే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయని, వినియోగదారులు వాపోతున్నారు. ప్రతి కూరలో ఉల్లిగడ్డలు తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉండటంతో ఎంత ధర ఉన్నా ఉల్లిగడ్డలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఉల్లిగడ్డల ధరలతో ప్రభుత్వాలు పడిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఉల్లిగడ్డలు తర్వాత ప్రజలు అత్యధికంగా కూరలకు, వివిధ వంటకాలకు అత్యధికంగా వినియోగించే టమాటా ధరలు సైతం ఇటీవల కాలంలో ఆకాశాన్ని అంటుకున్నాయి. టమాటా ధర మొన్నటి వరకు కేజీ 15 రూపాయల ఉంది. ప్రస్తుతం సాధారణ మార్కెట్లో టమాటా కేజీ 90 రూపాయలు ధర పలుకుతోంది. రైతు బజార్లో కేజీ 68 రూపాయలకు అందుబాటులో ఉన్న నాణ్యమైన టమాటా రైతు బజార్లో అందుబాటులో లేవని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీగా పంటలో దెబ్బతినటంతో కూరగాయలు ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒకవైపు కూరగాయల ధరలు పెరిగి సామాన్య ప్రజలను చిన్నాభిన్నం చేస్తుండగా మరోవైపు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి పెరిగిపోతున్న టమాటా ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు, కూరగాయల ధరలను నియంత్రణ చేయాలని, ప్రజలు కోరుతున్నారు.