అర్హులైన పేదలకు రెండు పడక గదుల ఇండ్లు

Published: Friday December 16, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
 
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 15, ప్రజాపాలన  :
 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న రెండు పడక గదుల ఇండ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో లబ్దిదారుల ఎంపిక ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా లాటరీ పద్ధతిన ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో 846 ఇండ్లు, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 650 ఇండ్లు లక్ష్యం కాగా 330 ఇండ్లను జనవరి 15, 2023 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, విద్యుత్, త్రాగునీరు ఇతరత్రా మౌళిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో రోడ్లు-భవనాల శాఖ ఈ. ఈ. రాము, తహశిల్దార్ రాజేశ్వర్ సంబంధిత అధికారులు తదితరులు
 
పాల్గొన్నారు.