ఇంటర్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన గుమస్తా కూతురుమట్టిలో మాణిక్యం మేఘనఇంటర్లో మేఘనకి

Published: Thursday June 30, 2022

మధిర జూన్ 29 ప్రజాపాలన ప్రతినిధి చదువుకు పేదరికం అడ్డుకాదని, కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అని ఒక దళిత విద్యార్థిని నిరూపించారు. ఒక కుగ్రామము నుండి వచ్చిన ఓ విద్యార్థిని పట్టుదలతో చదివి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. మధిర నియోజకవర్గం పరిధిలోని ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామానికి చెందిన చింతమాల మేఘన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఎంసిపి విభాగంలో 1000  కి 985 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన మేఘన పేద దళిత కుటుంబంలో జన్మించారు. తండ్రి చింతమాల ఆశీర్వాదం ఖమ్మంలో ఒక న్యాయవాది వద్ద గుమస్తాగా పని చేస్తుండగా తల్లి సుహాసిని గృహిణిగా ఉన్నారు. చిన్నతనం నుండి  మేఘన చదువుల్లో  చురుకుగా ఉండటంతో తండ్రి ఆశీర్వాదం తన కుమార్తెను మంచి స్కూల్లో చేర్పించి బాగా చదివించాలని లక్ష్యంతో చింతమాల  ఆశీర్వాదం వల్లబి నుండి ఖమ్మంకు మకాం మార్చారు. అనంతరం ఖమ్మం కోర్టులో న్యాయవాది వద్ద గుమాస్తాగా పనిలో   చేరి కష్టపడి పనిచేసి వచ్చిన నామమాత్రపు వేతనంలో కొంత కుమార్తె మేఘన చదువుకు ఖర్చు పెట్టారు. ప్రాథమిక విద్యను ఖమ్మం విజ్ఞాన్ పాఠశాలలో పూర్తి చేసిన మేఘన 6వ తరగతి నుండి నుండి 10వ తరగతి వరకు ఖమ్మం సెంట్ జోసెఫ్ పాఠశాలలో  చదివారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేఘన పదవ తరగతిలో టెన్ బై టెన్ మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచారు. ఇంటర్మీడియట్ చదివేందుకు ఖమ్మం  శ్రీ చైతన్య కళాశాలలో చేరి కష్టపడి చదివి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 464 మార్కులతో నాలుగో ర్యాంకును సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 985 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించినట్లు ఆమె తెలిపారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించిన చింత మాల మేఘనని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు  మద్దెల ప్రసాదరావు చింతకాని ముదిగొండ మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి సామినేని రవి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మేఘనని స్ఫూర్తిగా తీసుకొని చదువుకోవాలన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతమాల ఆశీర్వాదం పాల్గొన్నారు.