పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Published: Tuesday April 04, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన : 
 జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతిరోజు అన్ని మండలాలలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి కాపీయింగ్ జరగకుండా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేలా  చూడాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్ తాండూర్ ఆర్డీవోలు విజయ కుమారి, అశోక్ కుమార్ లతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాలలో ప్రతిరోజు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లు, 144 సెక్షన్ అమలు,  ఫ్లైయింగ్ స్క్వేర్డు, సిట్టింగ్ స్క్వేర్డు, విద్యార్థులకు కనీస వసతుల సౌకర్యాలైన త్రాగునీరు విద్యుత్తు రవాణా సదుపాయాలను పరిశీలించాలన్నారు.  పరీక్షా కేంద్రానికి దగ్గరగా ఉన్న జిరాక్స్ సెంటర్లను ముగించాలని ఆదేశించారు.  పరీక్షల తర్వాత ప్రతిరోజు మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందితో పరీక్షా కేంద్రాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టి పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈనెల 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 11 న మహాత్మ జ్యోతిబాపూలే, 14 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇట్టి కార్యక్రమాలలో  సెలవు దినాలుగా భావించకుండా అధికారులందరూ విధిగా పాల్గొనాలన్నారు. విగ్రహాల వద్ద పారిశుధ్య పనులతో పాటు విగ్రహాలకు కలరింగ్ పనులు చేపట్టాలన్నారు.  గ్రామ పంచాయతీలలో విగ్రహాలు లేని చోట ఫోటోలకు దండలు వేయాలని అన్నారు.  కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారంగా అందరూ ప్రజా ప్రతినిధులను ఆహ్వాన పత్రాలు అందజేయాలని సూచించారు.  కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల అధికారులు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విజయవంతం చేయాలని ఆదేశించారు. 

డబుల్ బెడ్ రూమ్ ల కొరకు ఇప్పటివరకు సేకరించిన దరఖాస్తుల ధ్రువీకరణ పనులను ఈరోజు నుండి చేపట్టాలని కలెక్టర్ అన్నారు.  ఇట్టి పనులను ఆర్డీవోలు,  తహసీల్దార్లు పూర్తి బాధ్యతతో చేపట్టాలని సూచించారు.  దరఖాస్తుల ధ్రువీకరణకు అవసరమైన టీంలు ఏర్పాటు చేసుకోని పారదర్శకంగా అర్హుల జాబితాను వారం రోజులలో సిద్ధం చేయాలని ఆదేశించారు.