రెండో జోన్ ద్వారా ఎర్రుపాలెం మండలానికి సాగనీరు అందించాలి

Published: Thursday December 29, 2022
సాగర కాలవలను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి*నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించిన భట్టి విక్రమార్క*
మధిర డిసెంబర్ 28 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర నియోజకవర్గం లోని ఎర్రుపాలెం మండలానికి రెండవ జోన్ ద్వారా సాగర్ జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మధిర నియోజకవర్గం పరిధిలోని నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎర్రుపాలెం మండలంలోని 16 వేల ఎకరాలకు మూడో జోన్ ద్వారా సాగర జలాలు అందటం వలన నెల రోజులు ఆలస్యంగా ఆ ప్రాంత రైతులు పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎర్రుపాలెం మండలం రెండో జోన్ కి ఎత్తు ప్రాంతంలో ఉండటం వలన ఆ భూములకు రెండవ జోన్ ద్వారా సాగర జలాలు అందటం లేదు. అందువల్ల అధికారులు రెండవ జోన్ పై ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేసి ఎర్రుపాలెం మండలానికి సాగునీరు అందించాలన్నారు. దీనిపై గతంలోనే తాను సర్వే చేయించడం జరిగిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో మరమ్మత్తులకు గురైన ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నారు. నిధులు మంజూరై పనులు కొనసాగుతున్న ఎత్తి పథకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగర కాలవలను ఆక్రమించుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. మధిర నియోజకవర్గంలో మూడు నదులు ఉన్నాయని వాటిలో వృధాగా పోతున్న జలాలు రైతులకు ఉపయోగపడే విదంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూసించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డిఈ నాగబ్రమ్మం ఏఈలు పాల్గొన్నారు.