తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

Published: Monday November 07, 2022
హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు
వికారాబాద్ బ్యూరో 6 నవంబర్ ప్రజా పాలన : తరచుగా ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని  హైకోర్టు న్యాయమూర్తి,  తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల కార్యనిర్వాహక చైర్మన్ నవీన్ రావు సూచించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మండల న్యాయ సేవా కమిటీ వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్యం అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని హైకోర్టు న్యాయమూర్తులు ఎం. లక్ష్మణ్,  సాంబశివరావు నాయుడు లతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన ఆరోగ్య అవగాహన శిబిరంలో జస్టిస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నట్లయితే తెలియని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని,  ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎన్నో అనర్థాలకు గురవుతామని ఆయన అన్నారు. స్థానికంగా డాక్టర్ జగన్మోహన్ ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం శుభసూచకమని ఆయన అన్నారు. ఇలాంటి ఉచిత క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.  కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు సమయానికి అంబులెన్స్ లేకపోవడం వల్ల ప్రాణాలు  కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు. డాక్టర్ జగన్మోహన్ సొంత ఖర్చులతో ప్రజల సౌకర్యార్థం అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. సమాజంలో సేవ చేయడానికి ముందుకు వచ్చే వారి సేవలను సద్వినియోగం చేసుకుంటూ వారిని ప్రోత్సహించడంతో పాటు వారికి సహకరించాలని ఆయన సూచించారు. కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల ప్రజలు న్యాయవాదులపై  ఒత్తిడి తేవడం వల్ల  ఆరోగ్యం దెబ్బ తినడం జరుగుతుందని ఆయన అన్నారు. న్యాయమూర్తి లక్ష్మణ్ మాట్లాడుతూ... జబ్బు వస్తే కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకొని వైద్యం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. సమాజంలో సేవ చేసే వారు ముందుకు వస్తే వారికి మనం చేయూతనందిస్తూ వారిని ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఒక్కో సందర్భాల్లో  ఒక్క నిమిషం కూడా చాలా అవసరమని మనమంతా కూడా ఎంతో కొంత సహాయం అందిస్తే కొంతమందినైనా కాపాడిన వారమౌతామని ఆయన అన్నారు. 
న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు మాట్లాడుతూ.. వైద్యులకు రోగులకు విడదీయరాని బంధం ఉందని అన్నారు. ఆరోగ్యం పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని ఆయన సూచించారు. మనం చేసే పనులతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుత సమాజంలో యువత ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చుకోవాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.  తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిర నిర్వాహకులు డాక్టర్ జగన్మోహన్,  వికారాబాద్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్, పరిగి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్ యాదవ్, న్యాయమూర్తి శ్రీదేవి, బార్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో న్యాయమూర్తులు మొక్కలు నాటారు.