బుగ్గ రామలింగేశ్వర గుండములో పడి యువకుడు మృతి

Published: Wednesday March 31, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 30 ( ప్రజా పాలన ) : బుగ్గ రామలింగేశ్వర ఆలయం గుండంలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన కె మహేష్ ( 22 ) జిల్లా కేంద్రంలోని ఉష కూల్డ్రింక్స్ డీలర్ వద్ద రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం స్నేహితులతో కలిసి హోలీ పండుగలో సంతోషంగా గడిపాడు. పండుగ ముగిసిన తర్వాత జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిలో స్నానం చేసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. స్నేహితులందరూ పుష్కరిణిలో ఈత కొడుతున్న దృశ్యాన్ని చూసి తాను కూడా ఈత కొట్టాలను కొని పుష్కరిణిలోకి దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులందరూ మహేష్ కోసం గాలించగా ఎంతకూ అతని జాడ కనిపించలేదు. మహేష్ నీటిగుండంలో పడి చనిపోయినట్లు స్నేహితులు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. మహేష్ కుటుంబీకులు రాత్రి సమయం వరకు వేచి చూసిన కుమారుని జాడ తెలియలేదు. మళ్లీ మంగళవారం ఉదయం కొడుకు మహేష్ కోసం గాలిస్తుండగా బుగ్గ రామలింగేశ్వర ఆలయం గుండం వద్ద మహేష్ ఒంటిపై ఉన్న దుస్తులు కనిపించాయి. గుండం దగ్గర దుస్తులు కనిపించడంతో అనుమానాన్ని నివృత్తి చేసుకొనుటకు గుండంలో గాలించగా మహేష్ శవం లభించింది. వెంటనే స్పందించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సత్యనారాయణ శిక్షణ ఎస్ఐలు ఇద్దరు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి గుండంలో నుంచి శవాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.