వరద నీరు ఇళ్ళలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు : మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్

Published: Wednesday September 29, 2021
వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజాపాలన : గులాబ్ తుఫాన్ ప్రభావంతో పలు వార్డులలోని ఇండ్లకు వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 15, 18, 19వ వార్డులను వార్డు కౌన్సిలర్లు చిట్యాల అనంత్ రెడ్డి, కొండేటి కృష్ణ, రాయికల్ నర్సిములు ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు. సోమవారం కురిసిన భారీ వర్షంతో ప్రజలు నిరాశ్రయులుగా మారారని విచారం వ్యక్తం చేశారు. ఎడతెరిపిలేని వర్షం కురవడంతో వరద నీరంతా ఇండ్లలోకి చేరి చిన్న తటాకాలను తలపిస్తున్నాయని స్థానిక కౌన్సిలర్లు చైర్ పర్సన్ దృష్టికి తెచ్చారు. లోతట్టు ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకున్న వారంతా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఇండ్లలోకి వరద నీరు రాకుండా గట్టి చర్యలు చేపడుతామని వార్డు ప్రజలకు భరోసా కల్పించారు. వరద నీటి ప్రవాహానికి లోతైన కాలువలను తవ్వించాల్సిన ఆవశ్యకత ఉందని గ్రహించారు. రానున్న మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప మరో రెండు రోజులపాటు ఎవ్వరు బయటకు రాకూడదని స్పష్టం చేశారు.