పులుమద్దిలో హాత్ సే హాత్ జోడో

Published: Tuesday February 14, 2023
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీగా మారినా ప్రజల తలరాతలు మారవని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ నూటొక్క వాగ్దానాలు చేసిన పూర్తి చేయలేని అసమర్థుడని ధజమెత్తారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి హాత్ సే హాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో కార్యక్రమానికి కొనసాగింపుగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు హాత్ సే హాత్ జూడో కార్యక్రమాన్ని వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పులుమద్ది మాజీ గ్రామ సర్పంచ్ మండల కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ అధ్యక్షుడు బోయిని శివయ్య ముదిరాజ్ అధ్యక్షతన గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి మనస్సుకు తట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించామన్నారు. ఏ ఊర్లోనైనా ఆర్ అండ్ బి రోడ్లు మంచిగున్నాయా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ 101వాగ్దానాలలో ఒకటో రెండో వాగ్దానాలను మాత్రమే నెరవేర్చిందని దెప్పి పొడిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామని భరోసా కల్పించారు. రెండుసార్లు అబద్ధాలను నమ్మి ఓటేశారు. కానీ ఈసారి నిజం తెలుసుకొని విజ్ఞతతో ఓటెయ్యాలని కోరారు. రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటే వారి దహన సంస్కారాలు నిర్వహించేందుకే స్మశానవాటికలను సిఎం కేసీఆర్ నిర్మించారని ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోడీ జీరో అకౌంట్ తెరిపించి ప్రతి అకౌంట్లో 15 వేలు ఇస్తానని మోసం చేశాడని విమర్శించారు. బిజెపిలో అప్పట్లో ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయిలా కాకుండా ఇప్పుడున్న ద్వంద్వ పాలకులు నరేంద్రమోదీ, అమిత్ షాలు పెద్ద క్రిమినల్స్ అని తూలనాడారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గ్రామాల అభివృద్ధిని పట్టించుకుంటున్నాడా అని ప్రజలనుద్దేశించి అడిగారు. డ్వాక్రా గ్రూపులను పాతాళ లోకంలోకి తొక్కిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. గత ఎన్నికల్లో పులుమద్ది గ్రామంలో నాకు మైనస్ ఓట్లు వచ్చాయి. ఈసారి నాకు అత్యధిక మెజార్టీ పులుమద్ది గ్రామం నుండి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తప్పక ఆశీర్వాదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసైన్ మెంట్ భూములకు క్రయవిక్రయ హక్కులు కల్పిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎత్తి చూపారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలను పీడించి కార్పొరేట్ బడాబాబులకు దోచిపెడుతుందని చెప్పారు. దేశ ప్రజలు ఈ విషయన్ని గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ మతాల పేరుతో దేశాన్ని విధ్వంసం చేసే కుట్ర చేస్తుందని ధ్వజమెత్తారు. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
మాజీ జడ్పీటీసీ మహిపాల్ రెడ్డి, ఎంపిపి కామిడి చంద్రకళ, వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖరరెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి, వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, బ్లాక్ ఎ అధ్యక్షుడు కామిడి అనంత్ రెడ్డి, వికారాబాద్ మండల కో ఆప్షన్ మెంబర్ ఎర్రవల్లి మాజీ సర్పంచ్ జాఫర్, కామిడి కమాల్ రెడ్డి, బురాన్ పల్లి మనోహర్ గౌడ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయ్యూబ్ అన్సారీ, బాలక్లిష్ణ,  నవీన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.