సర్పన్ పల్లి ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేపట్టాలి

Published: Friday December 02, 2022
గ్రామ అభివృద్ధికి 7 లక్షలు మంజూరు
: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 01 డిసెంబర్ ప్రజాపాలన : సర్పన్ పల్లి ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేపట్టాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ షాకెరా ఫకీరా ఖాన్ తో కలిసి మీతో నేను కార్యక్రమంలో భాగంగా గల్లీ గల్లీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  సర్పన్ పల్లి ప్రాజెక్ట్ నుండి  పంట పొలాలకు నీరందించే కాలువలు సరైన పద్దతిలో లేవని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్ట్ కాలువలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తాత్కాలికమైనటువంటి మరమత్తులు కాకుండా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో కొన్ని వార్డులకు థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామంలోని పాత స్థంబాలను తొలగించాలని స్పష్టం చేశారు. పంటపొలాల్లో పలుచోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని అన్నారు. రైతుల కోరిక మేరకు ఓల్టేజ్ సమస్య ఉన్నందున పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1,11,21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు, పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. మిషన్ భగీరథ పైపుల లీకేజీలను వెంటనే సరి చేసి, గ్రామ ప్రజలకు సరిపడేలా గేట్ వాల్వ్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. 8వ వార్డు ప్రజలకు సరిపడా నీరు అందించాలని తెలిపారు. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని సూచించారు. ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలోని అవసరమైన చోట రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచాలన్నారు. సర్పన్ పల్లి గ్రామాభివృద్ధికి 7 లక్షలు ఎమ్మెల్యే మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గయాజ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మండల యూత్ ప్రెసిడెంట్ కైల ఉపేందర్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్తకాపు మాణిక్ రెడ్డి, గ్రామస్థులు బాలరాజు, యాదయ్య, సత్తయ్య, అలావుద్దిన్, యూసుఫ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.