ప్రత్యేమ్నాయ పంటల సాగు మరియు ఆయిల్ పామ్ సాగుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించి అధికారులు

Published: Friday October 01, 2021

మధిర, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : రైతులకు పలు సూచనలు తెలియజేశారు సాధారణంగా వరి కోతలు నవంబర్ నెలలో మొదలై డిసెంబర్ నెలలో పూర్తవుతాయి. కనుక రైతు సోదరులు ప్రత్యామ్నాయ రబీ మరియు వేసంగి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి. చెరువు కింద కాలువల కింద  నీరు ఎప్పటికీ నిల్వ ఉండే భూముల్లో మరియు లోతట్టు ప్రాంతాలలో పంట మార్పిడికి అవకాశం లేనట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే స్వల్పకాలిక లేదా మధ్యకాలిక మధ్యకాలిక వరి రకాలు వేసుకో గలరు. ఉదాహరణకు తెలంగాణ సోనా వరంగల్ సాంబ వరంగల్ సన్నాలు జగిత్యాల సన్నాలు వంటివి. వరి కోత అనంతరం దుబ్బ ఇసుక మరియు చల్కా నేలల్లో నీటి సౌకర్యం ఉండి ఆరు నుంచి ఎనిమిది నీటి తడులు ఇవ్వగలిగిన రైతులు వేరుశనగ పంటను వేసుకోగలరు. మూడు నుంచి నాలుగు తడులు ఇవ్వగలిగిన రైతులు నువ్వులు, ఆవాలు, పెసర, మినుము, బొబ్బర్లు, సజ్జలు మరియు జొన్న పంటలు వేసుకో గలరు. వరి కోతలు పూర్తయిన తర్వాత వెంటనే నవంబర్ నెలలో నల్లరేగడి భూముల్లో కుసుమలు మరియు శెనగ వంటి పంటలు నీటి తడులు అవసరం లేకుండా సాగు చేసుకోవచ్చు. నీటి సౌకర్యం ఉన్న రైతులు పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలను నీటి తడులు తో పండించుకోవచ్చు. బావి లేదా బోరు నీటి ద్వారా వరి సాగు చేయు రైతులు సాధ్యమైనంత వరకు వరి పంటకు బదులుగా నేల రకాన్ని బట్టి మరియు నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలను వేసుకోవాలి అని పేర్కొన్నారు. ఉద్యానవన పంటలలో ప్రస్తుతం పామ్ ఆయిల్ సాగు కి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది, మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది కావున రైతులు సాగుకి సుముఖత చూపాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మధిర డివిజన్ ఉద్యానవన అధికారి ఆకుల వేణు గారు, మధిర వ్యవసాయ అధికారి DNK శ్రీనివాసరావు, మల్లారం క్లస్టర్ AEO వంశీ కృష్ణ సాయి, మల్లారం సర్పంచ్ మందడపు ఉపేంద్ర రావు జాలిముడి సర్పంచ్ తడికమల్ల ప్రభాకర్ రావు ఉప సర్పంచ్ కరివేద దుర్గాభవాని, మల్లారం, జాలిముడి గ్రామాల రైతు బంధు సమితి అధ్యక్షులు మందడపు రామకృష్ణ, బొగ్గుల కృష్ణారెడ్డి, మరియు గ్రామ రైతులు ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.