కరోనా కేసులు లేకుండా ప్రశాంతంగా తరగతులు

Published: Monday September 20, 2021
 ట్రస్మా జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు రాపోలు
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 19, ప్రజాపాలన : ప్రైవేటు పాఠశాలలో కరోనా కేసులు లేకుండా ప్రశాంతంగా తరగతులు కొనసాగుతు న్నాయని ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు అన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. గత 18 నెలలుగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలల్లో  ప్రత్యక్ష తరగతులకు ప్రభుత్వం అనుమతించిందని అన్నాారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలోని ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా ప్రశాంతంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 60 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారని తెలిపారు. గత రెండు రోజుల నుండి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయని కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని పుకార్లు పుట్టిస్తున్నారని వాటిని పట్టటించుకోవద్దని అన్నారు. వదంతుల వలన చాలామంది తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారని, ఈ పుకార్లను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తిగా కంట్రోల్ లోనే ఉందని, వచ్చే మార్చి వరకు థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి లేదని, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపడానికి భయపడొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలకు పంపించాలని కోరారు.