అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Saturday December 24, 2022
 ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 23 ప్రజాపాలన, ప్రతినిధి : 
 
పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలో అర్హులైన నిరుపేదలను గుర్తించి సంక్రాంతికి ముందే కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్, సిర్పూర్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప లతో కలిసి రోడ్డు భవనాల అధికారులతో రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంక్రాంతికి ముందు వీడియో రికార్డింగ్ ద్వారా డ్రా తీసి ఇండ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 288, సాలెగూడలో 16, జోడేఘాట్లో 30, లింగాపూర్ మండలంలోని పిట్టగూడలో 5 ఇండ్లు పూర్తయ్యాయని, ఆధార్ కార్డు చిరునామా ప్రకారం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, కాగజ్ నగర్ లో వార్డుల వారీగా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఇండ్ల కేటాయింపులో ఎస్సి. లకు 17 శాతం, ఎస్టి.లకు 1 శాతం, మైనారిటీలకు 12 శాతం, దివ్యాంగులకు ఇండ్లు లేని వారికి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి వార్డు నుండి10 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయింపు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.