రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు

Published: Monday July 31, 2023

గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అలాగే ఉండిపోయింది. రెండు రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. మళ్లీ తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.