Home తాజా వార్తలు పొన్నం సార్… జర దేఖో – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

పొన్నం సార్… జర దేఖో – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
పొన్నం సార్... జర దేఖో - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • బీసీ శాఖ ప్రక్షాళన చేయండి
  • అక్రమాలపై నజర్ వేయండి
  • తిష్ట వేసిన అధికారులపై చర్యలు తీసుకోండి
  • జీవో 15 ఎత్తేయండిపదోన్నతులు ఇవ్వండి
  • శాఖ సిబ్బంది వినతి
  • నేడు మంత్రి పొన్నంతో జూమ్ మీటింగ్
  • బీసీ జాబితాలో వణుకు
  • “ముద్ర” వార్తలతో గజగజ

ముద్ర, తెలంగాణ బ్యూరో: తిల పాపం తల పిడికెడు అన్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ భ్రష్టు పట్టడానికి కారణమైన శాఖ నివేదికపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు(ఈ నెల 26న) బీసీ సంక్షేమాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్ర , జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష జరపనుండటం ఆసక్తిని కలిగిస్తుంది. అధికారుల అలసత్వంతో ఇప్పటికే శాఖ పరువు మంట కలిసింది. 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచినా, ప్రభుత్వానికి రావాల్సినంత పేరు రాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులతో కామన్ మెనూ ప్రోగ్రాం కింద ములాఖాత్ చేసినా, అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దీనికి రాష్ట్ర వైఫల్యమే కారణం. ఓ పద్ధతి లేకుండా కార్యక్రమం జరిపి, చేతులు దులుపుకున్నారు. కానీ ప్రభుత్వం చేయూతను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో విఫలం అయ్యారు. ఫలితంగా బీసీ హాస్టళ్ల, రెసిడెన్షియల్ స్కూళ్ల పైనున్న చెడు అభిప్రాయం ఇంకా పోవడం లేదు. దీన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్ జరగనున్న తాజా శాఖ ప్రక్షాళనకు అడుగులు పడతాయేమోనని బీసీ సంఘాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం వేధిస్తున్న కొన్ని ముఖ్య సమస్యలపై బీసీ మంత్రి దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ముద్రణ పత్రికలో వచ్చిన వార్తలపై అధికారుల్లో వణుకు ప్రారంభం అవ్వగా, చర్యల కోసం మంత్రి పొన్నం స్పందించేందుకు వినతులు వస్తున్నాయి.

@ ఏళ్లుగా అధికారుల తిష్ట:

రాష్ట్ర బీసీ కమిషనరేట్ పొందిన కొందరు పది, ఇరవై ఏళ్లుగా తిష్ట వేశారు. వీరికి బదిలీలు ఉండవు. ఏదో కారణంతో ఇక్కడే విధులు నిర్వర్తిస్తారు. వీరు చెప్పిందే వేదం అన్నట్టు వీరు చేసిందే జీవోలా మారింది. ప్రతి పనికి రేటు కట్టడం వీరికి అలవాటుగా మారింది. వీరిపై ఏసీబీ కేసులున్నా, అందలం దక్కుతుంది.

@ అక్రమ డిప్యూటేషన్లు:

రాష్ట్ర బీసీ కమిషనరేట్ ఏళ్లుగా తిష్ట వేసినకు లంచాలు ఇచ్చే వారంటేనే ప్రేమ ఎక్కువ. అయిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తారు. అక్రమ పదోన్నతులు, డిప్యూటేషన్లు ఇవ్వడానికి వెనుకాడరు. అధికార కుర్చీలు వాటాలు వేసి, పంచుకోవడం పరిపాటిగా మారింది. ముగ్గురు మధ్య ఆధిపత్య పోరు ఉన్నా, అక్రమాలకు వస్తే, అంతా ఒక్కటేనంటే ఆశ్చర్యం లేదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ డీబీసీడీఓకు మేడ్చల్ జిల్లా అధికారిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ రెండు జిల్లాల మధ్య దూరం వందల కిలోమీటర్లు. అయినా అదనపు బాధ్యతలు ఇవ్వడం వెనుక హైదరాబాద్ కు దగ్గర ఉంచాలనే కుట్ర, ఇక్కడి కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చే అక్రమ వసూళ్లు పంచుకోవాలనే కోణం దాగి ఉందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా నుంచి నల్గొండ జిల్లాకు ఓ అధికారిని ఎఫ్ఏసీగా పంపడం వెనుక స్వార్థమే దాగుంది. ఇలా ఒకటేమిటి చాలా విషయాల్లో ఇలాంటి కుట్రలకు లెక్కేలేదు. వాస్తవానికి ఖాళీ అయిన కుర్చీలో, అక్కడే ఉన్న అధికారికి అదనపు అధికారి బాధ్యతలు ఇవ్వాలి. కానీ ఇలా ఇవ్వకపోగా, ఇష్టారీతిన బాధ్యతలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.

@ పెండింగ్ లోనే పదోన్నతులు:

ఉద్యోగుల హక్కులు, నిబంధనల ప్రకారం కుర్చీ ఖాళీ అయిన వెంటనే అర్హతగల మరో అధికారికి సీనియారిటీ, రోస్టర్ పాయింట్ ప్రకారం పదోన్నతి ఇచ్చి, ఖాళీ భర్తీ చేయాలి. మొత్తంగా ఏర్పడ్డ ఖాళీల్లో 70 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయడం, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయాలి. కానీ ఏళ్లుగా పదోన్నతులు కల్పించకుండా, ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారు. సాక్షాత్తూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2024 అక్టోబర్ 10న బీసీ అధికారులతో హైదరాబాద్‌లోని బంజారలో సమావేశం నిర్వహించి, అర్హులైన అందరికీ ఆలస్యం చేయకుండా పదోన్నతులు పొందుతున్నారు. అయినా ఇప్పటికీ పదోన్నతుల కల్పన జరగడం లేదు. అయినోళ్ళ నలుగురు ఉన్నతాధిరులకే ప్రమోషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ మిగిలిన సిబ్బందికి ఇవ్వకుండా ఏళ్లుగా తాత్సారం చేయడం విమర్శలకు తావిస్తోంది. రోజు ఆఫీస్ లో కలుస్తాం. రోజు మా పదోన్నతిపై విన్నవిస్తున్నాం.అయినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. మంత్రి దృష్టి పెట్టాల్సి ఉంది.

@ జీవో 15 ఎత్తేయాలి:

ఎక్కడలేని విధంగా గత ప్రభుత్వం హయంలో జీవో 15 తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారం 50 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 30 శాతం పదోన్నతులు, 20 శాతం ఇతర శాఖల నుంచి అధికారులకు పోస్టులు కల్పించాలని నిర్ణయించారు. బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల్లోలేని ఓ కొత్త జీవోను వారు ఎందుకు ప్రదర్శించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఖాళీలలోంచి 70 శాతం పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయవలసి ఉంది, ఈ జీవోతో కేవలం 30 శాతం పోస్టులను భర్తీ చేయడం ద్వారా సిగ్గు చేటని దుయ్యబడుతున్నారు. అధికారుల ద్వంద వైఖరితో పదోన్నతుల్లో తమకు అన్యాయం జరుగుతుందని డీబీసీడీఓలు, ఏబీసీడీఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీబీసీడీఓ, ఏబీసీడీఓల స్థాయి అధికారులకు పదోన్నతుల నిష్పత్తి తగ్గితే, వారికి పదోన్నతులు ఆలస్యం అవతరణ కింది స్థాయి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డీడీ, జేడీ, ఎండీ స్థాయి అధికారులకు ఈ జీవో 15 వర్తించకుండా ఉత్తర్వులు తీయడంలో ఇక్కడ పాతుకుపోయిన కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నారు. 15జీవో తొలగించి, మళ్లీ పాత జీఓ 36 ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ లను కలిసి న్యాయం కోరతామని బాధితులు స్పష్టం చేయడం విశేషం. ఉద్యోగ ధర్మంలో పదోన్నతి ని మించిన సంబరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆకారణంగా తమ హక్కును కాల రాయడాన్ని తప్పు పడుతున్నారు.

@ బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమం కలిపినా సమస్యలే?

గత ప్రభుత్వం బీసీ సంక్షేమంలో బీసీ కార్పొరేషన్ ను విలీనం చేసింది. అయినా ఇప్పటికీ పోస్టుల కేటాయింపులై లెక్కలు తీయలేదు. ఇప్పటికే తీసిన లెక్కల్లో లోప భూయిష్టత ఉంది. జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ వివరాలు ఇష్టారీతిన ఉన్నాయి. ఉన్నతాధికారి పోస్టులు తమ కోసం పంచుకొని కుర్చీల్లో కూర్చున్నా, కింది సిబ్బందికి మాత్రం ఇంకా ఖాళీల లెక్కలు తీయడం లేదు. ఫలితంగా బీసీ సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్ ఉద్యోగుల తమ హక్కుల కోసం రెండుగా విడిపోయారు. వీరి మధ్య విభేదాలు వస్తున్నాయి. పని భారం పెరుగుతుందని ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. గతంలో బీసీ కార్పొరేషన్ పరిధిలోని పోస్టులను బీసీ సంక్షేమ, బీసీ కార్పొరేషన్ ఉద్యోగుల ఉమ్మడి సీనియారిటీ ప్రకారం లెక్కలు తీసి, పదోన్నతులు ఇవ్వాలి. లేదంటే బీసీ కార్పొరేషన్ లోని ఖాళీ పోస్టులను సంక్షేమ శాఖలోని సీనియర్ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలి. కానీ ఇవేమీ చేయకుండా తాత్సారం చేయడం, జీవో 15 అమలు చేయడం, రాష్ట్రస్థాయి ద్వంద వైఖరి శాఖ ఉద్యోగుల్లో అసంతృప్తి రేపుతోంది. దీన్ని సరి చేయాల్సిన బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్ పైననే ఉంది.

@ స్టడీ సర్కిల్ లో సమస్యలు:

బీసీ స్టడీ సర్కిల్ సమస్యల నిలయంలో చిక్కుకుంది. కొత్త జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు జరగడం లేదు. స్థలాల సేకరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చారు, పనుల్లో వేగం పెరగడం లేదు. పోటీ పరీక్షలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నా, బీసీ స్టడీ సర్కిల్స్ పటిష్టత మాత్రం అట్టకెక్కుతుంది. రాష్ట్ర కమిషనరేట్ తిష్ట వేసిన వైఖరితోనే ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది. సరైన మార్గ నిర్దేశంలేక స్టడీ సర్కిల్స్ ప్రాధాన్యత కోల్పోవడం జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు సైతం అందించని దుస్థితి. బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇకనైనా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రక్షాళనకు మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు బీసీ మేధావి వర్గం కోరుతుంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న జూమ్ మీటింగ్ లో మంత్రు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech