- త్వరలోనే కీలక మలుపు తీసుకోనున్న వ్యవహారం
- రేపు మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు..?
- దానకిషోర్ స్టేట్ మెంట్ రికార్డు ఆధారంగా ఏసీబీ దూకుడు
- అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ స్ధాయిలో మొదలైన పైరవీలు
- అప్రూవల్ గా మారేందుకు అరవింద్ రెడీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్ కు రేపటి లోగా ఏసీబీ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనితో ఇప్పటి వరకు అనేక మలుపులు తీసుకున్న ఈ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకోబోతోంది. తాజా పరిణామాలు ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి రేపుతోంది. మరోవైపు.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్, అరవింద్ కుమార్ ఓ ఛానల్ ద్వారా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో దూకుడు పెంచిన ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది.
ఈ కేసులో ప్రభుత్వం తరపున మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ను ఏడు గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు విచారణను మొత్తాన్నీ రికార్డ్ చేసింది. ఫార్ములా ఈ రేసు మొదలు నిధులు విదేశీ కంపెనీ ఇచ్చిన వరకు జరిగిన ప్రతీ సూచన దాన కిశోర్ పూసగుచ్చి అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఈ వివిధ శాఖల నుంచి ఫైళ్లను తెప్పించుకున్న దాన కిశోర్.. తన దగ్గర పెట్టి అడిగిన ప్రతీదానికి సమాధానం చెప్పడంతో ఏసీబీ అధికారులు సైతం ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే దానకిశోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్‌లను విచారించేందుకు ఏసీబీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో వారిద్దరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని కోరుకుంటున్నది. వీరితోపాటు మరికొందరి అధికారులనూ ఏసీబీ తన అనుమానితుల జాబితాలో చేర్చినట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అరవింద్ దే కీలక పాత్ర..?
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ పాత్ర ఎక్కువగా ఉందని ఏసీబీ తన విచారణలో గుర్తించింది. కేబినెట్ అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధులు బదిలీ చేసినట్లు నిర్ధారించబడింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆ నిధులను బదిలీ చేసినట్టు గుర్తించింది. ఆ తర్వాత ఒప్పందాలు జరిగినట్టు నిగ్గు తేల్చింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి.. ఇప్పటికే సీఎంకి ఓ నివేదిక ఇచ్చిన ఏసీబీ.. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సైతం అందజేసింది. మరోవైపు..కేబినెట్, ఆర్థిక శాఖల అనుమతి లేకుండా రూ.45 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించి ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆర్బీఐ రూల్స్‌లో కాకుండా మౌఖిక నిధులతో నగదు బదిలీలు జరుగుతున్నాయి. రూ.10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపునకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలన్న రూల్ బుక్‌ను హెచ్ఎండీఏ ఫాలో కాలేదని.. చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు ఈ కారు రేసులో వ్యవహారంలో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఎండీఏ అధికారి బీఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసులు పెట్టారు.
అప్రూవల్ గా అరవింద్ కుమార్…?
మరోవైపు..అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు అరవింద్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం గత రెండు రోజుల నుంచి అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాల ద్వారా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అరవింద్ అప్రూవర్‌గా మారేందుకు సిద్ధపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేసు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చి వారిని విచారించడం సహజం. కేటీఆర్ ముందస్తు బెయిల్ సందర్భంగా సేకరించిన ఏసీబీ న్యాయస్థానానికి తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ప్రస్తుతం మారింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతోందోననే చర్చ ఉత్కంఠ రేపుతోంది.