ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముక సింగరేణి సంస్థ అని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కాలరీస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొగ్గు ఉత్పాత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోందని అన్నారు.
తెలంగాణలోని ఆరు జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవనాధారంగా ఉన్న సింగరేణిని కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా ఇతర రంగాలలోకి ప్రవేశించడానికి మరిన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని ఆయన పేర్కొన్నారు.