ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ప్రశాంతంగా ఉండేది. తమ సినిమాల ప్రోగ్రెస్ గురించి, సినిమా విడుదల గురించి, అవి సాధించిన విజయాల గురించి మాత్రమే మీడియాలో వార్తలు వస్తుండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా ఎన్నో వివాదాలతో చిత్ర పరిశ్రమ అట్టుడికిపోతోంది. అంతేకాదు, ఒకదాన్ని మించి ఒకటి అనేట్టుగా ఆ అంశాలు ఉంటున్నాయి. నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ వివాదం మీడియాలో, సోషల్ మీడియాలో ప్రధాన వార్తగా చోటు సంపాదించుకుంది. ఇప్పుడు మోహన్‌బాబు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం రచ్చకెక్కింది. మోహన్ బాబు, అతని కుమారుడు మనోజ్ మధ్య పెద్ద యుద్ధమే. దానికి ఆజ్యం పోసేట్టుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి విషయాలు బయటికి వచ్చేవి కాదు. తమకు వచ్చిన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకే ప్రయత్నించేవారు. దానికి దర్శకరత్న దాసరి నారాయణరావు వంటి వారు ఇరువర్గాలను సముదాయించి పరిస్థితి చేయిదాటి పోకుండా చేసేవారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పారు. దాసరి నారాయణరావు విషయానికి వస్తే.. పరిశ్రమలో వివాదం ఏర్పడినా, కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండేవారు. పరిశ్రమలోని సమస్యలే కాకుండా వారి వ్యక్తిగత జీవితంలో ఏదైనా అనుకోని పరిణామం జరిగినా దాసరినే ఆశ్రయించేవారు. ఇరువర్గాల వారిని పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు పరిశ్రమలోని వారి సమస్యలు ఇలా రచ్చకెక్కడానికి కారణం ఆ పెద్దాయన మనమధ్య లేకపోవడమే. ఆయనే ఉంటే ఇటీవల జరిగిన కొన్ని అంశాలు మీడియా వరకు వచ్చేవి కావు. అల్లు అర్జున్, ఫ్యామిలీ మధ్య ఏర్పడిన వివాదం మెగా, తాజాగా మంచు మోహన్‌బాబు కుటుంబంలోని వివాదం కావచ్చు.. అన్నీ దాసరి సమక్షంలోనే పరిష్కారమయ్యేవి.
సమాజంలో మునుపటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అలాగే సినిమా పరిశ్రమలో కూడా అంతకుముందు ఉన్న స్నేహపూరిత వాతావరణం లేదు. ఎవరు ఎలా బిహేవ్ చేసినా, ఎలాంటి వివాదాలు సృష్టించినా అడిగేవారు లేరు. ఇలాంటి సమ్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకొని ముందుకు వచ్చే వారు లేరు. ఒకవేళ వచ్చినా, వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చెయ్యాలన్నా వినేవారు కూడ లేరు అనేది వాస్తవం కూడా. ఏది ఏమైనా సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలంటే, ముందు వాతావరణం నెలకొనాలంటే దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.