హీరో సిద్ధార్థ్‌కి ఒకప్పుడు టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతని వ్యవహారశైలిలో మార్పు రావడంతో తెలుగు ప్రేక్షకులు పక్కన పెట్టారు. ఎప్పుడన్నా ఒక సినిమా తెలుగులో చేస్తున్నా.. ముందు వైభవం అయితే అతనికి రావడం లేదు. అందుకే తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేసాడు. గతంలో ఎన్నో వివాదాల్లో అతని పేరు వినిపించింది. అలాంటి వివాదస్పద ధోరణితోనే ఎన్నో అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా తనకు సంబంధం లేకపోయినా 'పుష్ప2' విషయంలో నోరు పారేసుకొని ఇప్పుడు తాపీగా క్లారిటీలు ఇస్తూ వస్తున్నాడు సిద్ధార్థ్. అయితే అతని విషయం అందరికీ తెలుసు కాబట్టి సినిమాపై అతను చేసిన వ్యాఖ్యలు కేవలం ఉక్రోషంతోనే చేశాడు.
ఇంతకీ అతను చేసిన కామెంట్ ఏమిటో చూద్దాం. 'పాట్నాలో జరిగిన పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా జనం రావడం అనేది కేవలం మార్కెటింగ్ అని చెప్పాలి. అది గొప్ప విషయం అని నేననుకోవడం లేదు. ఎందుకంటే రోడ్డుపై జేసీబీ వర్క్ చేస్తున్నా దాన్ని చూసేందుకు జనం గుమికూడతారు. ఇది కూడా అలాంటిదే. పాట్నా వంటి చోట అంత జనం రావడం విశేషం కాదు. ఒక మైదానాన్ని బ్లాక్ చేసి ఈవెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా జనం గుమికూడతారు. అంతెందుకు ఒక బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ మందు ఇస్తే రాజకీయ నాయకుల మీటింగ్‌కి కూడా జనం ఎగబడతారు. అంతమాత్రాన ఆ రాజకీయ పార్టీలు గెలుస్తాయా?' అంటూ 'పుష్ప2' భారీ సక్సెస్‌పై తన అక్కసును వెళ్ళగక్కుకున్నాడు.
ఇటీవల జరిగిన మరో ఈవెంట్లో 'పుష్ప2' సినిమాకి జరిగిన భారీ ఈవెంట్‌ను జెసిబితో పోల్చడం పట్ల మరోసారి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒప్పందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విషయంలో సరైన క్లారిటీ ఇచ్చే ఉద్దేశం లేదని అతని వివరణ చూస్తే అర్థమవుతుంది. 'నాకు ఎవరితోనూ ఎలాంటి సమస్యలేదు. 'పుష్ప2' సాధించిన భారీ విజయానికి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మొదటి పార్ట్ పెద్ద హిట్ అయిన విషయం. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగానికి కూడా జనాన్ని బాగా గ్యాదర్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు చేరుకుంటున్నారు. ఇతర సినిమాలు ప్రదర్శించే థియేటర్లకు కూడా జనాన్ని తరలిస్తారని ఆశిస్తున్నాను' అంటూ టిపికల్‌గా తన వివరణ ఇచ్చాడు సిద్ధార్థ్. తను చేసిన వ్యాఖ్యలకు అతను ఇచ్చిన వివరణ కూడా నెగెటివ్‌గానే ఉండటంతో సిద్ధార్థ్ మాట్లాడిన తీరును తప్పుబడుతున్నారు. 'పుష్ప2' భారీ విజయాన్ని అతను పాజిటివ్‌గా స్వీకరించలేకపోతున్నాడని, అందుకే అలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు నెటిజన్లు.