ముద్ర, తెలంగాణ బ్యూరో :- జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి కేంద్రానికి మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పసుపు రైతుల ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్ ప్రధానమైనదన్నారు. పసుపు రైతులు గత 10 సంవత్సరాల నుండి పసుపు మద్ధతు ధర కోసం ….జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యం పసుపు రైతులు కోరుకుంటున్నట్లుగా రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి ప్రకటించారు.
అదే విధంగా రాష్ట్రంలో 3,300 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి, అందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడం జిల్లా (1757 ఎకరాలు, ఖమ్మం (696 ఎకరాలు)ల నుండే 75 శాతం కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. ఈలలోని కొబ్బరి రైతులు కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ కొబ్బరితోటల కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం భద్రాద్రి కొత్తగూడెంలో ప్రత్యేకంగా రీజనల్ కొకనట్ డెవలప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
కొకనట్ బోర్డు ద్వారా రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు అంతరపంటలు, మిశ్రమ పంటల విషయంలో, చీడ పీడల నివారణకు తగిన సాంకేతిక సలహాలు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా కొబ్బరి రైతులలో నిర్వహణపరమైన మెళుకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. విలువ ఆధారిత ఉత్పత్తులు, నాణ్యమైన కొబ్బరి మొలకలను నూతన వంగడాలను అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 91,200 హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు, ప్రతి సంవత్సరం 40,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
ఇండియన్ ఇన్ అవుట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చీ అనేది మాత్రమే దేశంలో ఆయిల్ పామ్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల పామ్ ఆయిల్‌తో పాటు రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తున్నందున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటల విస్తీరణం జరుగుతున్నందున, రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రాంతీయ ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పామ్ ఆయిల్ రంగంలో రైతులకు అవసరమైన శాస్త్రీయ,సాంకేతిక సలహాలు అందించాలని లేఖ ద్వారా కేంద్రాన్ని ఆయన నిర్దేశించారు.