ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరాలను చెరువుల ఆక్రమణ తొలగించిన హైడ్రా ఇప్పుడు ఆయా చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి సారించింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతీనగర్ కు చేరువులో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ శ్రీకారం చుట్టింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువు (ఎఫ్‌టీఎల్)లో నిర్మించిన 5 అంతస్తుల 3 భవనాలను ఆగస్టు 14న హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే.
కూల్చిన అనంతరం నిర్మాణం వాడిన ఐరన్‌తో పాటు ఉపయోగపడే ఇతర సామగ్రిని తీసుకెళ్లి నిర్మాణ వ్యర్థాలను అక్కడే భవన నిర్మాణదారుడు వదిలివేశాడు. వ్యర్థాలను తొలగించని నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చి ఎర్రకుంటలో గుట్టలుగా పడి ఉన్న నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగించే పనులను హైడ్రా ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. నిర్మాణ వ్యర్థాలను తొలగించిన తర్వాత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మేరకు ఎర్రకుంట చెరువుకు పునరుజ్జీవనం కల్పడానికి హైడ్రా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.