- హైదరాబాద్ ఐఐటీతో ఎయిమ్స్ ఎంవోయూ
బీబీనగర్, ముద్ర ప్రతినిధి: వైద్య చికిత్సలలో ప్రస్తుతం సాంకేతికతకు అత్యంత ప్రాథాన్యం ఉంది. ఎన్ఆర్ఐ నుంచి ఎక్స్ రే దాకా, స్కానింగ్ నుంచి మోకాలి మార్పిడి దాకా ప్రతి చికిత్సలోనూ సాంకేతిక పరికరాల వినియోగం తప్పనిసరి అయింది. అలాగే అత్యంత ఆదునికమైన రోబోటిక్ టెక్నాలజీని కూడా శస్త్ర చికిత్సలలో వినియోగిస్తున్నారు. అలాగే సాంకేతిక రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ను కూడా వైద్య రంగంలోకి తీసుకురావడానికి అటు వైద్యులు, ఇటు సాంకేతిక నిపుణులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌గ్రేడ్ ఆఫ్ (ఐఐటీ) హైదరాబాద్‌తో కలిసి పరస్పరం విద్యా సహకారం అందించేలా ఒక మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, తన అధ్యాపక బృందంతో కలిసి గురువారం ఎయిమ్స్ ను సందర్శించారు. వైద్యరంగంలో నూతన సాంకేతిక వినియోగంపై మార్గదర్శక ఆలోచనలు, పరస్పర సహకార ప్రణాళికపై ఎయిమ్స్ అధికారులతో చర్చలు జరిగాయి. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా, ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ బీఎస్ మూర్తిల మధ్య ఎంవోయూ జరిగింది. పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ రెండు విద్యాసంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి, పరిశోధన అంశాలలో సహకరించడానికి ఈ ఎంవోయూ ముందుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ రెండు సంస్థలు కలిసి వైద్య రంగంలో సాంకేతిక అంశాలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు, పీహెడీ, మాస్టర్స్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ వంటి ఉమ్మడి కోర్సుల ప్రారంభం, పేటెంట్ల అభివృద్ధి, అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఉమ్మడి పరిశోధనలకు మార్గదర్శనం చేయడం వంటి వాటిని పరస్పరం సహకరించుకుంటాయి. ఇందుకు వీలుగా అవసరమైన సమావేశాలు, వర్క్ షాప్ ల నిర్వహణను రెండు విద్యాసంస్థలు చేపడతాయి. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ అధికారులు డాక్టర్ బిపిన్ వర్గీస్, డాక్టర్ అభిషేక్ అరోరా, మైక్రోబయాలజీ అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ శ్యామల అయ్యర్, ఇతర అధికారులు ఉన్నారు.