- పీడియాట్రిక్ క్లిష్టమైన శాస్త్ర చికిత్స
- వైద్య చరిత్రలో అరుదైన ఘనత
బీబీనగర్, ముద్ర ప్రతినిధి: వైద్య చరిత్రలో అరుదైన ఒక సమస్యను శస్త్రచికిత్సతో పరిష్కరించిన బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు శభాష్ అనిపించుకున్నారు. ఆ కన్నబిడ్డ తల్లిదండ్రుల ముఖాల్లో వెలుగులు నింపారు. తోకతో జన్మించిన మూడు నెలల చిన్నారికి శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. ప్రపంచంలో ఇప్పటిదాకా 40 మంది పిల్లలు మాత్రమే పుట్టుకతో తోక కలిగివున్నట్టుగా వైద్య చరిత్ర చెబుతోంది.
ఎయిమ్స్ వైద్యులు అందించిన వివరాల ప్రకారం… ఆరునెలల క్రితం బీనగర్ ఎయిమ్స్‌లో ఈ శాస్త్ర చికిత్సను చిన్నపిల్లల శస్త్రచికిత్సా విభాగాధిపతి, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంక్ పండా తన వైద్యబృందంతో కలిసి నిర్వహించారు. ఈ బిడ్డకు వున్న తోక పొడవు 15 సెంటీమీటర్లు. ఇది వెన్నెముకలో అయిదు వెన్నుపూసలతో అనుసంధానమై బయటకు వచ్చినట్టుగా పేర్కొన్నారు. నాడీ వ్యవస్థతో ముడిపడివున్నందున శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైనది వైద్యులు. సుమారు రెండున్నర గంటల పాటు ఈ శాస్త్రచికిత్స కొనసాగింది. బాలుడిని తల్లిదండ్రులు అయిదు రోజులపాటు ఐమ్స్‌లో పేషంట్‌గా ఉండి డిశ్చార్జ్ అయ్యారు.
సాధారణంగా ఈ తరహా శస్త్రచికిత్సల అనంతరం రోగి పరిపూర్ణ ఆరోగ్యవంతంగా తిరిగి జీవించడం అరుదు. నాడీ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఆశ్చర్యకరంగా ఈ బిడ్డకు ఆరు నెలల కాలంలో ఏవిధమైన నాడీ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకపోగా, తోకను తొలగించిన భాగంలో గాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. బయట ఆసుపత్రిలో ప్రసవించిన ఈ బిడ్డను మూడునెలల వయసులో గత జనవరి 2024లో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆరు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ అదే బిడ్డను తీసుకొచ్చినపుడు, ఆ బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఎయిమ్స్ పిల్లల శాస్త్ర చికిత్స విభాగం వైద్యులను అంతా అభినందిస్తున్నారు.