ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొదటి విడతలో లక్షలోపు 11 లక్షల మందికి 6 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయడం, జూలై వరకు రెండవ విడతలో ఆరు లక్షల మంది రైతులకు 6000 కోట్లు ఇవ్వడం జరిగింది.
అలాగే ఆగస్టు 15 లోపు మూడవ విడతలో 2 లక్షల లోపు రుణమున్న అందరి రైతులకు తమ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పెట్టుబడుల కోసం ధనవంతమైన దేశమైన అమెరికాకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 14వ తేదీన రాష్ట్రానికి రానున్నారని, 15వ తేదీన మూడో విడత రైతులకు రుణమాఫీ వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చిన్నారెడ్డి తెలిపారు. అర్హులై ఉండి రాని రైతులు ఎవరైనా ఉంటే హెల్ప్ లైన్ డెస్క్ లో సంప్రదించాలని ఆయన సూచించారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగ యువకుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధిని చాటారని ఆయన అన్నారు. దీనిని స్వాగతిస్తున్నామని ఇది శుభ పరిణామం అని ఆయన అన్నారు.
నియోజకవర్గానికి 3500 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం నిధులు అందించాలని ఆయన తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే నాలుగు వేలకు పెన్షన్ పెంచి కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని, కొత్త రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కిరణ్ కుమార్, రవి, యాది, బి కృష్ణ, కమర్, రాగి వేణు, చిన్న రాములు, జనార్ధన్ నాయకులు ఉన్నారు.