- కమిటీ చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సభ్యులుగా మంత్రులు తుమ్మల, జూపల్లి
- ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- రేపే కమిటీ తొలి భేటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని జలశయాలు వాటి పరిస్ధితి సామర్ధ్యం, వాటి నీటి నిల్వ పునరుద్దరణ సంస్థ పరిశీలనలు నిర్వహించేందుకు కేంద్ర జల వనరుల శాఖ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంత్రి వర్గ ఉపాన్ని ఏర్పాటు చేసింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఈ కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి కన్వీనర్ గా ఉన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రత్యేక దృష్టిసారించిన కేంద్రం ఆ మేరకు చర్యలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే కమిటీ నుంచి వచ్చే నివేదికలు, సూచనలు, పరిగణలోకి తీసుకుని ఆ నిధులు వెచ్చించాలని కోరుతోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని జలశయాల్లో నీటి నిల్వలు భారీగా తగ్గిన నేపథ్యంలో కమిటీ కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది..? కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.
రేపు కమిటీ తొలి భేటీ..
కేంద్రంతో నియమించబడ్డ కెబినెట్ సబ్ కమిటీ రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించనుంది. ఇందులో రాష్ట్రంలో ఉన్న జలశయాలు, వాటి నీటి నిల్వ సామర్ధ్యం, ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం (పూడిక కారణంగా తగ్గింది), దానితో పాటు అసలు కంటే ఎక్కువ సామర్ధ్యం పెంపుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉంది.