- “స్పిరిచ్యువల్ – వెల్నెస్ ” కేటగిరీలో సోమశిల
- “క్రాఫ్ట్స్” కేటగిరీలో నిర్మల్ కు అవార్డు
- హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలోని రెండు పర్యాటక గ్రామాలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి. 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో “స్పిరిచ్యువల్ – వెల్నెస్ ” కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల, “క్రాఫ్ట్స్” కేటగిరీలో నిర్మల్ ను ఎంపిక చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో “భారత ఉప రాష్ట్రపతి “జగ్దీప్ ధన్కడ్” ముఖ్య అతిధిగా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. పర్యాటక శాఖ అధికారి టి.నర్సింహా ఈ అవార్డులను అందుకున్నారు.
సోమశిల, నిర్మల్‌కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దకడంపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నిర్మల్ కొయ్య బొమ్మలకు, పేయింటింగ్స్‌కు, తన స్వంత నియోజక‐వర్గమైన కొల్లాపూర్‌లోని సోమశిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ వాసులకు, సోమశిల గ్రామస్థులకు, కళాకారులకు, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బందికి మంత్రి జూపల్లి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి టూరిస్ట్ డెస్టినేషన్‌గా తెలంగాణ పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని ఈ సందర్‌భంగా తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ కళలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాము, కళకారుల నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.