ముద్ర, తెలంగాణ బ్యూరో : నిత్యావసరవస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీగా పెరిగిన నిత్యవసరాల ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నిత్యం వినియోగించే పప్పులు, మంచినూనెతో పాటు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. వివిధ రకాల పప్పుల మీద కిలోకు రూ. 20 నుంచి రూ. 40 వరకు ధరలు పెరిగాయి. హెల్ సేల్ ఉత్పత్తులకు, చిల్లర ఉత్పత్తులకు నిత్యవసర వస్తుల ధరల్లో కొద్దిపాటి వ్యత్యాసం మాత్రమే పెరిగింది. చిల్లర ఉత్పత్తులలో గత నెలలో కిలో కందిపప్పు రూ. 150 ఉండగా, రూ. 175కు పెరిగింది. మినపప్పు బద్ద కిలో రూ. 135, అదే మినపగుండు పప్పు అయితే కిలో రూ.150 ఉంది. పెసరపప్పు ధర కూడా కిలోకు రూ. 150 వరకు పెరిగింది. అలాగే రూ. 120 ధర ఉండే సన్ ఫ్లవర్ మంచినూనే ప్యాకెట్ ధర ప్రస్తుతం రూ. 150కి పెరిగింది. కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. చిల్లరగా కిలో ఉల్లిపాయలను కొంటే రూ. 60 తీసుకుంటున్నారు. అలాగే బెండకాయ, వంకాయ, కాకరకాయ ధరలు మాత్రం కిలోకి రూ. 30 వసూలు చేస్తున్నారు. సొరకాయ ధర కూడా కాయ ఒక్కింటికి సైజును బట్టి రూ. 20 నుంచి రూ.30 వరకు చెబుతున్నారు. వచ్చే నెలలో దసరా, నవంబర్ నెలల్లో దీపావళి పండుగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యవసరాలు పెరిగిన ధరలను చూసి సామాన్యులు భయపడుతున్నారు.