పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం దేశంలో ఈ పేరు వినని సినిమా లవర్స్ లేరంటే అతిశయోక్తి కాదు. అందరూ డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభాస్.. ఒక డిఫరెంట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. లవర్‌బోయ్‌గా, మాస్ హీరోగా, యాక్షన్ హీరోగా, హాస్యాన్ని సైతం పర్‌ఫెక్ట్ టైమింగ్‌లో పండించగల హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ను అందరు హీరోల అభిమానులు ఇష్టపడతారు. అతని సినిమాలు చూసి థ్రిల్ అవుతారు. తొలి సినిమా 'ఈశ్వర్' నుంచి 'కల్కి 2898ఏడి' వరకు ప్రభాస్ చేసిన 23 సినిమాలు దేనికదే విభిన్నమైనవి. అన్ని సినిమాలూ డిఫరెంట్ జోనర్స్‌లోనే చేశారు. 'కల్కి' తర్వాత ఇండియాలోనే టాప్ హీరోగా నటించిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు కమర్షియల్‌గా ఏ హీరో సాధించని ఘనత రెబల్‌స్టార్ ప్రభాస్ సొంతం చేసుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలోగానీ, అతని సినిమాలు సాధించిన కలెక్షన్ల పరంగా గానీ ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ప్రభాస్ నిలిచారు. తను చేసే ప్రతి సినిమాతోనూ మంత్రముగ్ధుల్ని చేస్తూ ప్రేక్షకులతో డార్లింగ్ అనిపించుకుంటున్న రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. 2002లో హీరోగా కెరీర్ ప్రారంభించిన ప్రభాస్ కాకతాళీయంగా ఇప్పటివరకు ప్రభాస్ 23 సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. తొలి చిత్రం 'ఈశ్వర్' నుంచి ఈ ఏడాది విడుదలైన 'కల్కి 2898ఎడి' చిత్రం వరకు ప్రభాస్ సినిమాల్లో విజయం సాధించిన సినిమాలెన్ని, పరాజయాన్ని చవిచూసిన సినిమాలెన్ని, హిట్ అయిన సినిమాల కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుసుకుందాం.
ఇక్కడ ఉదహరించిన కలెక్షన్స్ అన్నీ గ్రాస్ కలెక్షన్సే. కొన్ని సినిమాల కలెక్షన్లు బడ్జెట్ కంటే ఎక్కువ కనిపించినా అవి గ్రాస్‌గా, షేర్‌పరంగా నిర్మాతలకు, బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలే. 2002లో విడుదలైన 'ఈశ్వర్’ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్ రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. థియేటర్లలో ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న 'ఈశ్వర్' రూ.3.5 కోట్లు కలెక్ట్ చేసింది. బాషా వంటి బ్లాక్‌బస్టర్ అందించిన సురేష్‌కృష్ణ దర్శకత్వంలో బి.శ్రీనివాసరాజు నిర్మించిన ప్రభాస్ రెండవ సినిమా 'రాఘవేంద్ర'. 2003లో విడుదలైన ఈ సినిమాలో అన్షు హీరోయిన్‌గా నటించింది. రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.5.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినప్పటికీ ఫ్లాప్ మూవీగా నిలిచింది.
ప్రభాస్ కెరీర్‌ని ఒక్కసారిగా టర్న్ చేసిన సినిమా 'వర్షం'. 2004లో విడుదలైన ఈ సినిమా శోభన్ దర్శకత్వంలో ఎం.ఎస్.రాజు నిర్మించారు. ఈ సినిమాలో హీరో గోపీచంద్ విలన్‌గా నటించడం విశేషం. త్రిష హీరోయిన్‌గా ఈ నటించిన సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా సినిమా బ్యాక్‌బస్టర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.35 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.
2004లోనే విడుదలైన 'అడవిరాముడు' ఫ్లాప్ అయింది. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, రూ.12 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ సినిమా అనిపించుకుంది. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన 'చక్రం' చిత్రం ఫ్లాప్ అయింది. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.9 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ప్రభాస్‌లోని గొప్ప నటుడ్ని ఆవిష్కరించిన సినిమా ఇది.
ప్రభాస్‌ను స్టార్ హీరోని చేసిన 'ఛత్రపతి' 2005లో విడుదలైంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా రూ.12.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, రూ.40 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్‌గా నటించింది.
2006లో ప్రభుదేవా దర్శకత్వంలో ఎం.ఎస్.రాజు నిర్మించిన సినిమా 'పౌర్ణమి'. ఈ రూ. 10 కోట్లతో నిర్మించగా, రూ.14 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అనిపించుకుంది. అలాగే 2007లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందించిన 'యోగి' రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది, రూ.20 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ సినిమాగా నిలిచింది. అదే సంవత్సరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన 'మున్నా' చిత్రం కూడా పరాజయాన్ని చవిచూసింది. రూ.14 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.16 కోట్లు కలెక్ట్ చేసింది.
2008లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన 'బుజ్జిగాడు' ప్రభాస్‌లోని కామెడీ యాంగిల్‌ని ఆవిష్కరించింది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.26 కోట్లు కలెక్ట్ చేసి ఎబౌ ఏవరేజ్ సినిమా అనిపించుకుంది. 2009లో మెహర్ రమేష్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ పతాకంపై కృష్ణంరాజు నిర్మించిన 'బిల్లా' కూడా ఎబౌ ఏవరేజ్ అయింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.26 కోట్లు కలెక్ట్ చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఏక్‌నిరంజన్' రూ.26 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా రూ.23 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అనిపించుకుంది.
2010లో ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందించిన 'డార్లింగ్' చిత్రంతో లవర్‌బోయ్‌గా తనలోని కొత్త కోణాన్ని చూపించారు ప్రభాస్. రూ.18 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.37 కోట్లు వసూలు చేసి సూపర్‌హిట్ చిత్రం అనిపించుకుంది. 2011లో దశరథ్ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్'తో మరో సూపర్‌హిట్ అందుకున్నారు ప్రభాస్. రూ.11 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.45 కోట్లు కలెక్ట్ చేసి సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాతి సంవత్సరం ప్రభాస్ విజయపరంపరకు రాఘవ లారెన్స్ 'రెబల్'తో బ్రేకులు వేశారు. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.55 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ సినిమా అనిపించుకుంది. ఇక 2013 సంవత్సరం ప్రభాస్ కెరీర్‌కి అత్యంత కీలకంగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన 'మిర్చి' ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ.35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.80 కోట్ల కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా రికార్డు సృష్టించింది.
2015లో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన 'బాహుబలి1' చిత్రంతో ఒక్కసారిగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.650 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక 2017లో విడుదలైన 'బాహుబలి2'తో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రభాస్. రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.1810 కోట్లు కలెక్ట్ చేసి ఆలిండియా ఇండస్ట్రీ హిట్‌గా చరిత్ర సృష్టించింది.
ఇండియాలోనే తిరుగులేని హీరోగా ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తర్వాత 'సాహో'. సుజిత్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 2019లో విడుదలైంది. ఈ సినిమా రూ.350కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన రూ.439 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో ఫ్లాప్ అనిపించుకున్నప్పటికీ బాలీవుడ్‌లో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. 2022లో రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందించిన 'రాధేశ్యామ్' డిజాస్టర్ అయింది. రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.152 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ దూకుడుకి కళ్ళెం వేసింది. ఆ తర్వాత 2023 'ఆదిపురుష్'తో ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.397 కోట్లు కలెక్ట్ చేసింది.
2023లోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన 'సలార్' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయి ప్రభాస్‌ని హిట్ బాటలో నడిపించింది. రూ.270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.705 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. 2024లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించిన 'కల్కి 2898ఎడి' చిత్రం రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినా ఏమిటో మరోసారి రుజువు చేసింది.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల. అలాగే సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. ఈ సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఆ తర్వాత రూ.350 కోట్ల బడ్జెట్‌తో 'సలార్ 2' సెట్స్‌పైకి వెళ్ళనుంది. అదేవిధంగా 'కల్కి 2898ఎడి' పార్ట్ 2 రూ.700 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభం కానుంది. ఇవిగాక హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తుంటే భారీ నుంచి అతి భారీ సినిమాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకొని అందరితోనూ డార్లింగ్ అని పిలిపించుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్న రెబల్‌స్టార్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.