- మొత్తం అడిగే ప్రశ్నలు 75
ముద్ర, తెలంగాణ బ్యూరో :-మరి కొద్ది గంటల్లో రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు జగనున్న ఈ సర్వేలో మొత్తం 75 అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడగనున్నారు.ప్రధానంగా ఈ ప్రక్రియలో కుటుంబ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయం వంటి పలు కీలక అంశాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇందు కోసం గత కొన్నిరోజుల నుంచే అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం సన్నద్ధం చేసింది. సర్వేలో అడిగే ప్రశ్నలను 2 విభాగాలుగా విభజించారు.
మెుదటి సభ్యుల కుటుంబ యజమానితోపాటు ఇంటి సభ్యుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. రెండోవలో కుటుంబ పూర్తి వివరాలు తీసుకున్నారు. పార్ట్-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. పార్ట్-బి కింద కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు మిగిలినవి అనుబంధ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టనున్నారు. కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, ఇల్లు, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న బ్యాంకు లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అప్పులు ఎందుకు తీసుకున్నారు. ఎక్కడ నుంచి రుణం పొందారు. ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ వివరాలను సైతం తీసుకుంటారు.
సర్వే చేసే విధానం
లో ప్రజలు తీసుకున్న అప్పులపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు అడుగుతారు. గత ఐదేళ్ల కాలంలో ఏమైనా అప్పులు తీసుకున్నారా.. ఎందుకు తీసుకున్నారు.. ఎక్కడి నుంచి తీసుకున్నారు అనే ప్రశ్నలు అడగనున్నారు. వీటికి వివరంగా సమాధానం చెప్పాలి. బ్యాంకులు, ఎస్‌హెచ్‌జీ నుంచే కాకుండా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నారా అనే వివరాలను కూడా చెప్పాల్సి ఉంది.
గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారా? ఆ పథకాలు ఏంటి? వీటి వివరాలు కూడా సేకరిస్తారు. కచ్చితమైన సమాచారం సర్వే చేసే వారికి ఇవ్వాలి. కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలకు సంబంధించి కూడా ప్రశ్నలు ఉన్నాయి. ద్విచక్రవాహనం, కారు, వాషింగ్ మిషన్, ఫ్రిజ్, ఏసీ, టీవీ, స్మార్ట్‌ఫోన్ ఇలా మొత్తం 18 రకాల వివరాలు చెప్పాల్సి ఉంటుంది.ఇంటికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇల్లు ఎన్ని గజాల్లో.. ఏ ప్రాంతంలో ఉందా? మొత్తం గదులన్నీ.. బాత్రూం, మరుగుదొడ్డి ఉన్నాయా ఇలాంటి వివరాలు చెప్పాలి. భూమికి సంబంధించి.. ఎంత భూమి, ఎన్ని ఎకరాలు, అది పట్టా భూమా? ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్ ల్యాండా, పట్టాలేని భూమా.. ఈ వివరాలను స్పష్టంగా చెప్పాలి.
ఈ సమగ్ర కుటుంబ సర్వేలో యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేసుకుంటారు. దీంతోపాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నంబరు, వారు చేసే పని, ఉద్యోగ వివరాలను సేకరిస్తారు. ఈ సర్వే ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అవకాశాలు మెరుగు, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించేందుకు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సర్వేకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా వ్యవహరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 వేల మంది సర్వేలో పాల్గొంటారు. వీరిలో విద్యాశాఖ నుంచి 48,229 మంది ఉన్నారు. టీచర్లే కాకుండా ఇతర కేటగిరీల ఉద్యోగులను కూడా సర్వేకు వినియోగించుకుంటున్నారు.