- యోగా, ఆయుర్వేదం వైద్యాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళాలి
- హైదరాబాద్, వరంగల్ లో ఆయూష్ యూజీ, పీజీ సీట్లు పెంచుతాం
ముద్ర, తెలంగాణ బ్యూరో : అల్లోపతి లాగానే ఆయుర్వేద వైద్యానికి పెద్దపీట వేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చెప్పారు. యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదని, మానవాళికి సంబంధించిన అంశమని ఆయన చెప్పారు. మానవశరీరం, జ్ఞానం, మనస్సుకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో యోగా, ఆయుర్వేదం వైద్యాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు సోమవారం నాడు హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహా ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైం యోగా ఇన్‌స్ట్రాక్టర్లకు మంత్రి రాజనర్సింహా అపాయింట్‌మెంట్ లెటర్లు అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంకో 214 మంది యోగా ఇన్ స్ట్రక్టర్ త్వరలో నియమిస్తామన్నారు. ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారని అన్నారు. కానీ మనం దాన్ని కొనసాగించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. యోగా అద్భుతాలను భవిష్యత్ తరాలకు అందించారు. హైదరాబాద్, వరంగల్ లోని కాలేజీల్లో ఆయూష్ యూజీ, పీజీ సీట్లు సంఖ్య పెంచుతామన్నారు. ఆయూష్ విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలను నిర్మిస్తామన్నారు. అలాగే వారం రోజుల్లో విద్యార్థుల స్టయిఫండ్ ను చెల్లిస్తామన్నారు.